90 years old: 90 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు.. 42 ఏళ్ల కిందటి కేసులో తాజాగా తీర్పు

90 years old man sentenced lifeterm by UP court

  • దళితుల హత్య కేసులో సుదీర్ఘ కాలం సాగిన విచారణ
  • పది మంది నిందితులలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఒక్కరే
  • కోర్టు తీర్పుతో ఇద్దరు పోలీసులు చెరోపక్క సాయంపట్టి వృద్ధుడిని జైలుకు తీసుకెళ్లిన వైనం

తొంభై ఏళ్ల వృద్ధుడికి యూపీలోని ఫిరోజాబాద్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఓ హత్య కేసులో దోషిగా తేల్చిన కోర్టు.. జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా కూడా విధించింది. హత్యాయత్నానికి సంబంధించిన మరో కేసులో పదేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించింది. తొంభై ఏళ్ల వృద్ధుడిపై హత్య, హత్యాయత్నం కేసులు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది ఇప్పటి కేసు కాదు. సుమారు 42 ఏళ్ల కింద జరిగిన పది మంది దళితుల హత్యకు సంబంధించిన కేసు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇన్నాళ్లకు తీర్పు వచ్చింది. దీంతో పోలీసులు సదరు వృద్ధుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. చేతికర్ర సాయంతో నిలబడ్డ వృద్ధుడిని ఇద్దరు పోలీసులు చెరోపక్క పట్టుకుని జైలుకు తీసుకెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ లోని మణిపురి జిల్లా షికోహాబాద్ సమీపంలోని సాధూపూర్ లో 1981లో పది మంది దళితులు హత్యకు గురయ్యారు. సాధూపూర్ రేషన్ డీలర్ గంగా దయాళ్ కు, ఆ దళితులకు జరిగిన గొడవ ఈ హత్యలకు దారితీసింది. మరో తొమ్మిది మందితో కలిసి గంగా దయాళ్ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పదిమంది దళితులు ప్రాణాలు వదిలారు. దీనిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గంగా దయాళ్ తో పాటు పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను జైలుకు పంపగా.. కొన్నాళ్ల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.

కేసు విచారణ కొనసాగుతుండగా నిందితులు ఒక్కొక్కరుగా చనిపోయారు. ప్రస్తుతం గంగా దయాళ్ ఒక్కడే జీవించి ఉన్నాడు. రెండేళ్ల క్రితం ఈ కేసు ఫిరోజాబాద్ కోర్టుకు బదిలీ అయింది. దాదాపు 42 ఏళ్లు విచారణలోనే గడిచిపోయాయి. తాజాగా ఈ కేసులో గంగా దయాళ్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. హత్యలు జరిగిన చోట గంగా దయాళ్ ఉన్నాడని ప్రాసిక్యూషన్ నిరూపించడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది. కోర్టు తీర్పుతో 90 ఏళ్ల గంగా దయాళ్ ను పోలీసులు జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News