Subrahmanyam Jaishankar: ఇండియాకు తిరిగొచ్చాక చెప్తా.. రాహుల్‌గాంధీపై మంత్రి జైశంకర్ కౌంటర్
- అమెరికా పర్యటనలో బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
- రాహుల్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
- విదేశాల్లో ఉండగా తాను స్వదేశీ వ్యవహారాలపై మాట్లాడనని స్పష్టీకరణ
- అయితే, ఇండియాలో మాత్రం విమర్శలకు దీటుగా జవాబిస్తానని వ్యాఖ్య
అమెరికా పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ, అధికార బీజేపీని విమర్శించడంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తాజాగా స్పందించారు. విదేశాల్లో ఉన్నప్పుడు తాను రాజకీయాలు చేయనని, కానీ స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం విమర్శలకు దీటుగా జవాబిస్తానని చెప్పారు.
బ్రిక్స్ దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన జైశంకర్ ఇటీవల కేప్‌టౌన్ నగరంలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి రాహుల్ గాంధీ విమర్శల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. దీనిపై మంత్రి జైశంకర్ కూడా రాహుల్ గాంధీ ప్రస్తావన తేకుండానే సమాధానమిచ్చారు.
‘‘విదేశాల్లో ఉన్నప్పుడు నేను రాజకీయాలు మాట్లాడను. కానీ స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రమే నేను రాజకీయ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉంటాను. దేశ ప్రతిష్ఠను నిలబెట్టాల్సిన ఉమ్మడి బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. స్వదేశీ రాజకీయాలకంటే ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయన్న విషయాన్ని విదేశాల్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పరంగా నేను ఎవరితో విభేదించినా కూడా భారత్‌లో ఉన్నప్పుడే చర్చకు దిగుతాను. నేను ఇండియాకు వచ్చాక ఏం చేస్తానో మీరే చూస్తారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.