Andhra Pradesh: రైల్వే స్టేషన్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు.. 19 నిమిషాలపాటు పట్టాలపైనే నిలిచిపోయిన రైలు

Railway get left open near kadiri railway station after gatemen left his post unannounced

  • శుక్రవారం అర్ధరాత్రి కదిరి స్టేషన్‌కు సమీపంలో వెలుగు చూసిన ఘటన
  • కుటాగుళ్ల వద్ద జాతీయరహదారిపై తెరిచి ఉన్న రైల్వే గేటు, గేట్‌మెన్ గైర్హాజరు,
  • విషయం గుర్తించిన వెంటనే లోకోపైలట్‌ను అప్రమత్తం చేసిన స్టేషన్ సిబ్బంది
  • గేటుకు కిలోమీటరు దూరంలో రైలును నిలిపివేసిన లోకోపైలట్
  • ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దిన సిబ్బంది
  • విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన గేట్‌మెన్‌పై ఉన్నతాధికారుల వేటు

రైల్వే గేట్‌మెన్ నిర్లక్ష్యంగా కారణంగా నాగర్‌కోయిల్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు 19 నిమిషాల పాటు పట్టాలపైనే నిలిచిపోవాల్సి వచ్చింది. అయితే, స్టేషన్ సిబ్బంది, లోకోపైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. నాగర్‌కోయిల్-ముంబై ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 11.50 గంటలకు కదిరి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే, కుటాగుళ్ల వద్ద 42వ జాతీయ రహదారిపై ఉన్న రైల్వే గేటు తెరిచి ఉండటాన్ని స్టేషన్ సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు. 

గేటు వద్ద విధులు నిర్వహించాల్సిన గేట్‌మెన్‌ నరసింహులు గైర్హాజరు కావడంతో గేటు తెరిచే ఉంది. అతడికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్టేషన్ సిబ్బంది వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో, ఆయన రైలును గేటుకు సుమారు కిలోమీటరు దూరంలోనే నిలిపివేశారు. మరోవైపు, గేటు తెరిచి ఉండటాన్ని గుర్తించిన కొందరు వాహనదారులు ఇతర వాహనచోదకులను అప్రమత్తం చేయడంతో రైలు పట్టాలకు ఇరు వైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న రైల్వే సిబ్బంది గేటు వేసి రైలును పంపించి పరిస్థితిని చక్కదిద్దారు. రైల్వే స్టేషన్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పింది. కాగా, విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన గేట్‌మన్ నరసింహులును సస్పెండ్ చేస్తూ డీఆర్ఎం ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News