Coromandel: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారు: వాల్తేరు డీఆర్ఎం
- ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
- మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 288 మంది దుర్మరణం
- కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్న 100 మంది
- జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్న ఏపీ వాసుల వివరాలు పరిశీలించాల్సి ఉందన్న డీఆర్ఎం
భారత రైల్వే చరిత్రలో ఘోరం అనదగ్గ దుర్ఘటన ఒడిశాలోని బాలాసోర్ లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లోనూ భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ఘటనపై వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) స్పందించారు.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. వారిలో 100 మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. జనరల్ బోగీల్లో ఎంతమంది ఏపీ ప్రయాణికులున్నారో పరిశీలించాల్సి ఉందని చెప్పారు.
బాలాసోర్ నుంచి ప్రయాణికులతో కూడిన ప్రత్యేక రైలు మరో రెండు గంటల్లో విశాఖ రానుందని వాల్తేరు డీఆర్ఎం వెల్లడించారు. విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలాసోర్ వెళుతోందని వివరించారు. యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఎందరు ఏపీ ప్రయాణికులు ఉన్నారో తేలాల్సి ఉందని అన్నారు.
కాగా, బహానాగ్ స్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ ఐజీ వివరాలు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదంలో మొత్తం 17 బోగీలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఘటన స్థలిలో ఇప్పుడు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. విచారణ తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
అటు, రైల్వే అధికారి అమితాబ్ శర్మ స్పందిస్తూ, ఘటన స్థలిలో సహాయ చర్యలు పూర్తయ్యాయని వెల్లడించారు. బోగీల తొలగింపు, ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు. ప్రమాదం జరిగిన మార్గంలో 'కవచ్' సౌకర్యం లేదని చెప్పారు.