PM Modi: బాలాసోర్ కు బయలుదేరిన ప్రధాని మోదీ
- ప్రమాద స్థలంలో అధికారులతో కలిసి పరిశీలన
- కటక్ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ
- ఉదయం ఢిల్లీలో ఉన్నతాధికారులతో మోదీ సమావేశం
ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రమాద వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రిని ఆదేశించారు. ప్రధాని మోదీ సూచనలతో శుక్రవారం రాత్రే అశ్విని వైష్ణవ్ బాలాసోర్ కు బయలుదేరి వెళ్లారు. మరోవైపు, ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోదీ భేటీ అయ్యారు. ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఢిల్లీ నుంచే పర్యవేక్షించారు. రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు, ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోదీ కూడా ఒడిశా బయలుదేరారు. కాసేపటి క్రితమే ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని బయలుదేరినట్లు సమాచారం. ప్రమాద స్థలిలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరపడంతో పాటు కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు.