Perni Nani: ఇది చంద్రవరం యాత్ర.. పవన్ వారాహి యాత్రపై పేర్ని నాని సెటైర్ల వర్షం

Perni Nani satires on Pawan Kalyan Varahi tour

  • ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర
  • అన్నవరం నుంచి ప్రారంభం
  • చంద్రవరం యాత్ర అంటే బాగుంటుందన్న పేర్ని నాని
  • ఓ టూర్ ప్యాకేజీలా ఉందని వ్యంగ్యం
  • పవన్ ను బిళ్లపాడు కళాకారులతో పోల్చిన వైనం

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14న అన్నవరం నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ వారాహి యాత్ర తొలిగా అన్నవరం నుంచి భీమవరం వరకు జరుగుతున్నట్టు తెలిసిందని, ఆ యాత్ర పేరును చంద్రవరం అని పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

గతంలో అమరావతి నుంచి తిరుపతి, అరసవల్లి యాత్రలు చేశారని, చూస్తుంటే ఇవన్నీ టూర్ ప్యాకేజీల్లా ఉన్నాయని, ఇప్పుడు అన్నవరం నుంచి భీమవరం కూడా టూర్ ప్యాకేజీలానే ఉందని వ్యాఖ్యానించారు. 

"దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి వచ్చింది... ఇక అన్నవరం, భీమవరం వచ్చిందా? ఎవడి కోసమో గానీ, ఆయన తిప్పలు ఆయనను పడనీయండి. ఎప్పుడూ చూడనటువంటి యాత్ర జనాలకు చూపిస్తానని పవన్ కల్యాణ్ అంటున్నాడు. ఇవన్నీ కూడా సినిమా ముహూర్తం రోజున చెప్పే మాటల్లా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా రూ.100 కోట్లు సాధిస్తుందని, సినిమా సూపర్ హిట్ అని, రికార్డులు బద్దలు కొడుతుందని హీరో, దర్శకుడు, నిర్మాత చెబుతుంటారు. ఇదంతా సినిమా తంతులాగే ఉంది. 

ఆయనే చెబుతున్నాడు... మాకు సీట్లు అక్కర్లేదు, మాకు అధికారం అక్కర్లేదు, చంద్రబాబునాయుడు గెలివాలి... మేం మద్దతు ఇస్తాం... జగన్ దిగాలి...  ఇదే మా సంకల్పం అని చెబుతున్నాడు కదా... ఇంకేటి ఆయన జనాలకు చేరువ చేసేది? 

అధికారం చంద్రబాబునాయుడిదని చెబుతున్నాడు, ముఖ్యమంత్రి పీఠం చంద్రబాబుకేనని చెబుతున్నాడు. నాకు కాసిని సీట్లు ఇస్తే చాలని చెబుతున్నాడు. గెలవడం నా వల్ల కాదని చెబుతున్నాడు, నాకు జనం ఓటేయరని చెబుతున్నాడు... ఇంకేంటి జనాల్లోకి తీసుకెళ్లేది? ఈ మాటలు సినిమా ప్రమోషన్ కు తప్ప దేనికీ పనికిరావు. ఇది అన్నవరం, భీమవరం, పోలవరం యాత్ర కాదు... ఇది చంద్రవరం యాత్ర. 

ఒక రాజకీయ పార్టీ పెట్టింది జగన్ పై దుమ్మెత్తి పోయడానికా? జగన్ అధికారంలో ఉన్నా తిట్టడమే, జగన్ అధికారంలో లేకపోయినా తిట్టడమే. అధికారంలో ఉన్నా చంద్రబాబును పొగడడమే, అధికారంలో లేకపోయినా చంద్రబాబును పొగడడమే. 

గుడివాడ దగ్గర బిళ్లపాడు కళాకారులని ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాన్ని కీర్తిస్తూ పాడుతుంటారు. వాళ్లు సమాచార ప్రసార శాఖ ద్వారా వస్తుంటారు. పవన్ తీరు కూడా బిళ్లపాడు కళాకారుల్లాగే ఉంది. పాపం, బిళ్లపాడు కళాకారులు పోషణ కోసం పాడుతుంటారు. పవన్ చంద్రబాబు కోసం పనిచేస్తుంటాడు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఈ సందర్భంగా పేర్ని నాని... పవన్, నాదెండ్లలను సుందోపసుందులు అంటూ ఎద్దేవా చేశారు. ఓ తెనాలి సీటు, ఓ పిఠాపురం సీటు వస్తే చాలని సుందోపసుందులు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News