Gujarat: మంచి దుస్తులు ధరించి గాగుల్స్ పెట్టుకున్నాడని.. దళిత యువకుడిపై దాడి
- గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఘటన
- ‘ఈ మధ్య బాగా ఎదుగుతున్నావ్’ అంటూ హెచ్చరించిన ‘రాజ్పుత్’ యువకులు
- అడ్డొచ్చిన దళిత యువకుడి తల్లిపైనా దాడి
- ఏడుగురిపై కేసు నమోదు
మంచిగా డ్రెస్ చేసుకుని కళ్లకు గాగుల్స్ పెట్టుకున్నందుకు ఓ దళిత యువకుడిపై దాడి జరిగింది. గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పలన్పూర్ తాలూకాలోని మోతా గ్రామానికి చెందిన యువకుడు మంచి దుస్తులు ధరించి, కళ్లకు చలువ అద్దాలు పెట్టుకుని ఇంటి బయట నిల్చున్నాడు. అది గమనించిన అగ్రవర్ణ కులానికి చెందిన ఏడుగురు వ్యక్తులు అతడి వద్దకు వచ్చి ‘ఈ మధ్య బాగా ఎదుగుతున్నావ్’ అని దూషిస్తూ చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.
అదే రోజు రాత్రి ఊళ్లోని గుడి వద్ద నిల్చున్న యువకుడి వద్దకు చేరుకున్న ‘రాజ్పుత్’ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు యువకుడి వద్దకు వచ్చి ఎందుకలా డ్రెస్ చేసుకుని గాగుల్స్ పెట్టుకున్నావని ప్రశ్నిస్తూ దాడికి దిగారు. ఆ తర్వాత అతడిని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న డెయిరీ పార్లర్ వెనక్కి తీసుకెళ్లి విచక్షణ రహితంగా దాడిచేశారు. అది చూసి అడ్డుకునే ప్రయత్నం చేసిన అతడి తల్లిని కూడా ఈడ్చిపడేశారు. ఆమె దుస్తులు చింపేశారు. చంపేస్తామని బెదిరించారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ చేయలేదు.