Bonda Uma: ప్రశాంత్ కిశోర్ సర్వే వచ్చినప్పటి నుంచి జగన్ లో అసహనం పెరిగిపోయింది: బొండా ఉమ
- పోటీ చేయడానికి వైసీపీకి 175 మంది అభ్యర్థులు లేరన్న బొండా ఉమ
- వివేకా హంతకులకు అండగా ఉన్న జగన్ కు క్రెడిబిలిటీ ఉందా అని ప్రశ్న
- ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టారని విమర్శ
వైనాట్ 175 అంటున్న వైసీపీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 175 మంది అభ్యర్థులు లేరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. ఒకవేళ అభ్యర్థులు ఉంటే వారి పేర్లను వెంటనే జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు అనే విషయం ప్రశాంత్ కిశోర్ సర్వేలో తేలిందని... అప్పటి నుంచి జగన్ లో అసహనం పెరిగిపోయిందని అన్నారు.
చంద్రబాబు క్రెడిబిలిటీ గురించి జగన్ మాట్లాడుతున్నారని... సొంత బాబాయ్ వివేకాను హత్య చేసిన వారికి అండగా ఉన్న జగన్ కు క్రెడిబిలిటీ ఉందా? అని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన పేదల పెన్నిధి చంద్రబాబు అని... ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టినోడు జగన్ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.