TSPSC: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. ఏకంగా కోచింగ్ సెంటర్ కే పేపర్ అమ్మకం
- సిట్ విచారణలో బయటపడుతున్న సంచలన విషయాలు
- కేసులో మొత్తంగా 50 మందిపై శాశ్వతంగా వేటు
- వరంగల్ లో కోచింగ్ సెంటర్ కేంద్రంగా పేపర్ అమ్మకం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఏఈఈ, డీఏవో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏకంగా కోచింగ్ సెంటర్ కే అమ్మినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. వరంగల్ కేంద్రంగా నడుస్తున్న ఓ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రశ్నపత్రాల విక్రయం జరిగినట్లు అధికారులు తేల్చారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రమేశ్ సుమారు 20 మందికి ప్రశ్నపత్రాలను అమ్మినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు.. సదరు ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్న వారిని ప్రశ్నించేందుకు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల అదుపులో ఉన్న విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ రమేశ్.. పలువురు అభ్యర్థుల నుంచి భారీ మొత్తం వసూలు చేసి ప్రశ్నపత్రం అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు పరీక్షలకు సంబంధించి 25 పేపర్లను అమ్మాడని తెలిపారు. ఏఈఈ పరీక్షకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాయంతో రమేష్ జవాబులు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 43 కు చేరుకోగా.. మరో 50 మందిపై శాశ్వతంగా వేటు పడింది. భవిష్యత్తులో వారు ఎలాంటి పోటీ పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేశారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.