Ayodhya Rami Reddy: టీడీపీలో కలకలం రేపుతున్న కేశినేని నాని వ్యవహారం.. వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న అయోధ్యరామి రెడ్డి

We welcome Kesineni Nani into YSRCP says Ayodhya Rami Reddy

  • విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా డోంట్ కేర్ అన్న కేశినేని
  • అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తానని వ్యాఖ్య
  • కేశినేని చాలా మంచివారన్న వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ప్రస్తుతం టీడీపీలో కాక పుట్టిస్తోంది. వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలను కలుస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఎంపీగా ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా డోంట్ కేర్ అని... ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కుడా తాను సిద్ధమేనని ఆయన నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తన వ్యాఖ్యలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని అన్నారు. తన నియోజకర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో తనకు పార్టీలతో సంబంధం లేదని, ఎవరితోనైనా కలిసి పని చేస్తానని ఆయన వ్యాఖ్యలు చేశారు. తన మనస్తత్వానికి సెట్ అయితే ఏ పార్టీ అయినా ఓకే అని అన్నారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని టీడీపీని వీడి, వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది.  

ఈ క్రమంలో, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని చాలా మంచివారని, తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని చెప్పారు. ఆయన వైసీపీలోకి వస్తే చాలా సంతోషమని అన్నారు. నాని ప్రజల కోసం పని చేస్తారని, కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటారని ప్రశంసించారు. వైసీపీలోకి కేశినేని వస్తే స్వాగతిస్తామని చెప్పారు. రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

More Telugu News