Dhoni: ధోనీ అందరి వాడు..! గుజరాత్ టైటాన్స్ బౌలర్ కు ఓదార్పు!

Dhoni consoles heartbroken Mohit Sharma with brilliant gesture after Jadeja smashes him in last over of IPL final

  • చివరి ఓవర్ బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ
  • చెన్నై గెలుపుతో తీవ్ర నిరాశ చెందిన గుజరాత్ బౌలర్
  • దగ్గరకు తీసుకుని ఓదార్చిన ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టు సారథిగా గొప్ప విజయాలు అందించాడు. అన్ని ఫార్మాట్లలో ప్రపంచకప్ ను భారత్ కు అందించాడు. చెన్నై జట్టుకు ఐదు సార్లు టైటిళ్లను తెచ్చిపెట్టాడు. ఇదంతా ధోనీ ప్రత్యేక నైపుణ్యాలు, కలుపుకుని పోయే స్వభావం వల్లేనని చెబుతుంటారు. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ, పరిస్థితులకు తగ్గట్టు ఫీల్డింగ్ ను మారుస్తూ మంచి ఫలితాలను రాబట్టగలడు. ధోనీ కెప్టెన్ సామర్థ్యాలకు ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలుపును గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెన్నైలో దీపక్ చాహర్ మినహా మిగిలిన బౌలర్లు అందరూ కుర్రకారే. అంతర్జాతీయంగా వారికి ఎలాంటి అనుభవం లేదు. వారితోనే ధోనీ చక్కని ఫలితాలను రాబట్టాడు.

ధోనీ అందరినీ కలుపుకుని పోయే స్వభావానికి నిదర్శనంగా ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత కనిపించిన ఓ దృశ్యాన్ని చెప్పుకోవచ్చు. గుజరాత్ జట్టు తరఫున చివరి ఓవర్ ను మోహిత్ శర్మ వేశాడు. మొదటి నాలుగు బంతులను అతడు గొప్పగానే యార్కర్లుగా వేశాడు. దీంతో చెన్నై బ్యాటర్లు జడేజా, దూబే కేవలం మూడు పరుగులే రాబట్టారు. ఇక చివరి రెండు బంతులను జడేజా సిక్సర్, బౌండరీగా మార్చడంతో చెన్నై విజయం ఖాయమైంది. తన బౌలింగ్ వల్లే గుజరాత్ ఓటమి పాలైందన్న నిరాశతో ఉన్న మోహిత్ శర్మను ధోనీ దగ్గరకు తీసుకుని ఓదార్చుతున్నట్టు తలను నిమిరాడు.

More Telugu News