LB Nagar: ఎల్బీనగర్ అగ్ని ప్రమాదంలో 3 కోట్ల నష్టం.. ఏడుస్తూ సొమ్మసిల్లిపడిపోయిన యజమాని
- సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం
- కాలిబూడిదైన 20 కార్లు
- మరో నాలుగు కార్లను జాగ్రత్తగా బయటకు తీసిన పోలీసులు
- బూడిదైన కార్లను చూసి కన్నీరుమున్నీరుగా విలపించిన యజమాని
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో గత రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20 కార్లు కాలి బూడిదయ్యాయి. దీంతో దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని చూసి తట్టుకోలేని వాటి యజమాని ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటి జంగయ్య నగర్‌లోని ‘కార్ ఓ మ్యాన్’ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది. ఓ గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో గ్యారేజీలోని 20 కార్లు దగ్ధమయ్యాయి.
దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం నుంచి నాలుగు కార్లను బయటకు తీయగలిగామని, మిగతావి అగ్నికి ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదన్నారు. కాగా, కార్లు కాలిపోవడంతో దాదాపు రూ. 3 లక్షల నష్టం వాటిల్లింది. విషయం తెలిసిన కార్ల గ్యారేజీ యజమాని విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన నష్టాన్ని చూసి లబోదిబోమన్నారు. ఏడుస్తూ సొమ్మసిల్లిపడిపోయారు.