Sachin Tendulkar: వాటిని నేను ఎన్నడూ ప్రమోట్ చేయలేదు: సచిన్ టెండూల్కర్
- జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే ఫిట్నెస్, క్రమశిక్షణ ముఖ్యమన్న సచిన్
- పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటూ తనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని వెల్లడి
- వాటిని తాను అంగీకరించలేదని, తిరస్కరించానని వ్యాఖ్య
- నోరు ఆరోగ్యంగా ఉంటే.. శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందన్న మాస్టర్ బ్లాస్టర్
జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే ఫిట్‌నెస్‌పై అవగాహన, క్రమశిక్షణ చాలా అవసరమని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. గతంలో పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటూ తనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని, కానీ తాను ఎన్నడూ వాటిని ఒప్పుకోలేదని, తిరస్కరించానని వెల్లడించాడు. మహారాష్ట్ర ప్రభుత్వ ‘స్మైల్ అంబాసిడర్’గా నియమితుడైన సచిన్.. మంగళవారం నిర్వహించిన ‘స్వచ్ఛ ముఖ్ అభియాన్’ కార్యక్రమంలో మాట్లాడాడు.
‘‘స్కూల్ చదువులు పూర్తి కాగానే నేను టీమిండియాకు ఆడటం మొదలుపెట్టాను. ఎన్నో ప్రకటనల ఆఫర్లు వచ్చేవి. కానీ పొగాకు ఉత్పత్తుల యాడ్స్ కు మాత్రం ఒప్పుకోవద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి ఆఫర్లు ఎన్నో వచ్చేవి. కానీ నేను అంగీకరించలేదు’’ అని వివరించాడు.
నోరు ఆరోగ్యంగా ఉంటే.. శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని సచిన్ చెప్పాడు. ఫిట్ నెస్ చాలా ముఖ్యమని, లక్ష్యాలను అందుకోవడంలో సాయపడుతుందని వివరించాడు. ‘‘నేను చిన్నతనంలో చాలా ఆడుకునే వాడిని. కానీ క్రికెట్‌కు ఆకర్షితుడయ్యాను. పెద్దయ్యాక.. నా ఫిట్ నెస్ విషయంలో క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాను. ఎందుకంటే ఫిట్ గా లేకుంటే లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదు’’ అని చెప్పుకొచ్చాడు.
ఫిట్‌గా ఉండటం అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని, అయితే అది మీ లుక్స్‌కి సంబంధించినది మాత్రమే కాదని, మానసిక దృఢత్వం, నోటి పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని వివరించాడు. ‘‘యాభై శాతం మంది పిల్లలకు నోటి సంబంధిత వ్యాధులు ఉన్నాయి. అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఎవరూ దాని గురించి బాధపడరు. ఈ వ్యాధులు పిల్లల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి’’ అని వివరించారు.