Kodali Nani: కొడాలి నానిని వైసీపీ నుంచి బహిష్కరించాలి: ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన
- కాపులపై కొడాలి నాని వ్యాఖ్యల వివాదం
- నానిపై జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
- కొడాలిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలన్న ఐక్య కాపునాడు
వైసీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్ చేశాయి. కాపులను అసభ్యకరంగా కొడాలి నాని దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యేగా ఉండి కూడా కులం పేరుతో బూతులు తిడుతున్నారని, కొడాలి నాని తీరును అన్ని వర్గాలు గమనిస్తున్నాయని తెలిపాయి.
వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసినంత మాత్రాన సరిపోదని, సాటివారిని గౌరవించడాన్ని నేర్చుకోవాలని హితవు పలికాయి. కొడాలి నానిపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నానిని ఏ పార్టీ కూడా చేర్చుకోకుండా తీర్మానం చేస్తామని తెలిపాయి. చంద్రబాబు, నారా లోకేశ్ లను తిడుతూ కాపులను ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాపు సంఘాలు ఈ మేరకు స్పందించాయి.
కొడాలి నానిని వైసీపీలోని కాపు నాయకులు ప్రశ్నించాలని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. నానిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని అన్నారు. కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... కాపు జాతిని కించపరడం యావత్ రాష్ట్రానికి అవమానమని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ... గుడివాడలో కొడాలి నాని గెలిచింది కాపు ఓట్లతోనేనని... వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని చెప్పారు.