ipl: ఫైనల్‌కు ముందు గిల్‌పై సచిన్ ప్రశంసల జల్లు
- ఈ సీజన్లో అతని ఆట అద్భుతం అని కితాబు
- అతని రెండు శతకాలు ముంబై, ఆర్సీబీని దెబ్బకొట్టాయన్న సచిన్
- ఫైనల్లో గిల్, పాండ్యా, మిల్లర్ వికెట్లు సీఎస్కేకు కీలకమని వ్యాఖ్య
ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ దుమ్మురేపుతున్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు కొట్టిన అతను జీటీని ఫైనల్ చేర్చాడు. ఈ రోజు అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో గుజరాత్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారమే ఫైనల్ జరగాల్సిన ఉన్నా వర్షం కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది. అయితే, ఫైనల్ మ్యాచ్ కు ముందు గిల్, గుజరాత్ శిబిరంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉత్సాహం నింపాడు. గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
‘ఈ సీజన్లో శుభ్‌మన్ గిల్ ప్రదర్శన మరపురానిది. ముఖ్యంగా అతను చేసిన చివరి రెండు సెంచరీలు లీగ్‌పై చాలా ప్రభావాన్ని చూపించాయి. అందులో ఒకటి ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ ఆశలపై నీళ్లు కుమ్మరించగా.. మరొకటి ఇంకో జట్టు (ఆర్సీబీ) అవకాశాలను దెబ్బతీసింది. క్రికెట్లోని అనూహ్య స్వభావం అలాంటిది మరి! శుభ్‌మన్ బ్యాటింగ్‌లో నిజంగా నన్ను ఆకట్టుకున్నవి అతని అద్భుతమైన టెంపర్మెంట్, ప్రశాంతత, పరుగులు చేయాలన్న ఆకలి, వికెట్ల మధ్య చురుకుదనం. గుజరాత్ చాలా బలమైన జట్టు. ఫైనల్లో గిల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ వికెట్లు చెన్నైకి అత్యంత కీలకం. చెన్నై బ్యాటింగ్ కూడా లోతుగానే ఉంది. కాబట్టి ఈ ఫైనల్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది’ అని సచిన్ సుదీర్ఘ ట్వీట్ చేశాడు.