Turkey: టర్కీ పీఠం మళ్లీ ఎర్డోగాన్దే.. మూడో దశాబ్దంలోకి అడుగు!
- ఆదివారం జరిగిన రీఎలక్షన్లో ఎర్డోగాన్ విజయం
- ఇప్పటికే రెండు దశాబ్దాలుగా టర్కీని ఏలుతున్న ఎర్డోగాన్
- మే 14న జరిగిన ఎన్నికల్లో ఓటమి.. ఇప్పుడు జయకేతనం
టర్కీ (తుర్కియే) అధ్యక్షుడిగా రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన రీఎలక్షన్లో మొత్తం 92 శాతం బ్యాలెట్ బాక్సులను తెరవగా ఎర్డోగాన్ 52 శాతం, ఆయన ప్రత్యర్థి కెమాల్ కిలిక్దారోగ్లు 48 శాతం ఓట్లు సాధించినట్టు అనధికారిక వర్గాల సమాచారం. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ ఎర్డోగాన్ విజయాన్ని టర్కీ ఎన్నికల బోర్డు ప్రకటించినట్టు కూడా తెలుస్తోంది.
ఇప్పటికే రెండు దశాబ్దాలపాటు టర్కీని పాలిస్తున్న ఎర్డోగాన్ ఈ విజయంతో మూడో దశాబ్దంలోకి ప్రవేశించారు. ఇస్తాంబుల్, అంకారాలలో ఎర్డోగాన్ ప్రసంగిస్తూ తనకు విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంకారాలోని అధ్యక్ష భవనం వెలుపల గుమికూడిన వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి ఎర్డోగాన్ మాట్లాడుతూ.. రెండో శతాబ్దం కోసం కష్టపడి పనిచేస్తానని అన్నారు. దీనిని ‘టర్కీ శతాబ్దం’గా అభివర్ణించారు.
టర్కీ ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. రెండు దశాబ్దాలుగా టర్కీని పాలిస్తున్న ఎర్డోగాన్ మే 14న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో విజయానికి దూరమయ్యారు. ఎన్నికల్లో ఆయన పూర్తిగా ఓటమి చెందడం ఇదే తొలిసారి. అయితే, ఆదివారం జరిగిన రీ ఎలక్షన్లో ఆయన విజయం సాధించి మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.