Samalkot: కాకినాడలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు
- మధ్యాహ్నం వరకు ఎండవేడిమితో అల్లాడిన ప్రజలు
- సాయంత్రం భయపెట్టిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
- రైల్వే విద్యుత్ లైన్‌పై పడిన చెట్ల కొమ్మలు
- రైళ్ల రాకపోకలకు అంతరాయం
కాకినాడలో నిన్న సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అప్పటి వరకు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం భయపెట్టింది. తొలి 40 నిమిషాలు బలమైన గాలులు వీయగా, ఆ తర్వాత గంటపాటు వర్షం కుమ్మేసింది. గాలులు విద్యుత్ తీగలు తెగి చెట్ల కొమ్మలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సామర్లకోటలో రైల్వే ట్రాక్‌పై విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు రైళ్లు రెండు గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో 35 స్తంభాల నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే, కాకినాడ జిల్లాలో భారీ చెట్లు కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి.