Gwalior: పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు బాలికలు.. నాన్నను అరెస్టు చేయాలంటూ విజ్ఞప్తి!
- తమ తల్లిని తండ్రి కొడుతున్నాడంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు బాలికలు
- తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
- మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో ఘటన
తమ తల్లిని తండ్రి కొడుతున్నాడంటూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఇద్దరు బాలికలు. ‘అంకుల్.. అమ్మను కాపాడండి.. నాన్నను అరెస్టు చేయండి’ అంటూ పోలీసులను కోరారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా భిటర్వార్ పోలీస్ స్టేషన్ లో జరిగిందీ ఘటన.
స్టేషన్ లోకి ఇద్దరు అక్కాచెళ్లెళ్లు రావడం, చిన్న పిల్లలైన వారి వెంట ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టారు. పిల్లల నుంచి వివరాలు ఆరా తీశారు. ‘‘మీరేమీ భయపడాల్సిన పని లేదు.. సమస్య ఏంటో చెప్పండి’’ అని స్టేషన్ ఇన్ చార్జ్ ప్రదీప్ శర్మ అడిగారు.
‘‘అమ్మను నాన్న కొడుతున్నాడు.. నాన్నను అరెస్టు చేయండి’’ అంటూ పిల్లలు కోరారు. వారు చెప్పిందంతా విన్న ప్రదీప్ శర్మ.. నేరుగా వారి ఇంటికి వెళ్లారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యభర్తలు గొడవ పడుతూ ఉంటే, పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని చెప్పారు. తండ్రికి కూడా వార్నింగ్ ఇచ్చారు.
కాగా.. స్టేషన్ లో ఆఫీసర్ ఎదుట పిల్లలు కూర్చున్న ఫొటో వైరల్ అవుతోంది. పెద్దమ్మాయి స్టేషన్ ఇన్ చార్జ్ ఎదురుగా కూర్చుని మాట్లాడుతుండగా, చిన్నమ్మాయి దీనంగా కూర్చుని ఉంది. ఏమాత్రం భయపడకుండా స్టేషన్ దాకా వెళ్లిన పిల్లల ధైర్యాన్ని పోలీసులు సహా అందరూ మెచ్చుకుంటున్నారు.