Temple: జమ్మూలో టీటీడీ నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయం మహా సంప్రోక్షణకు సీఎం జగన్ కు ఆహ్వానం
- కశ్మీర్ లో రూ.33 కోట్లతో వెంకటేశ్వరస్వామి ఆలయం
- త్వరలోనే ప్రారంభోత్సవం
- సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన టీటీడీ
జమ్మూ కశ్మీర్ లో 2021లో టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. రూ.33 కోట్లతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. జమ్మూలోని మజీన్ లో నిర్మిస్తున్న ఈ భారీ ఆలయం కోసం ప్రభుత్వం 62.10 ఎకరాలు కేటాయించింది. 18 నెలల కాలంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీ భావించగా, ఇటీవలే ఆ నిర్మాణం పూర్తయింది.
ఈ నేపథ్యంలో, ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నేడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఎల్ఏసీ న్యూఢిల్లీ చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు.
జమ్మూలో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ మహా సంప్రోక్షణకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంకు ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రిక అందజేశారు.