Bopparaju: పోరాటం వల్లే ప్రభుత్వం విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తోంది: బొప్పరాజు
- విజయవాడలో ఆర్టీసీ ఈయూ 27వ రాష్ట్ర మహాసభలు
- హాజరైన బొప్పరాజు, ద్వారకా తిరుమలరావు తదితరులు
- ఏపీ జేఏసీ అమరావతిలో ఆర్టీసీ కార్మిక సంఘానిది కీలకపాత్ర అన్న బొప్పరాజు
విజయవాడలో ఆర్టీసీ ఈయూ 27వ రాష్ట్ర మహాసభలకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ జేఏసీ అమరావతిలో ఆర్టీసీ కార్మిక సంఘానిది కీలక పాత్ర అని వెల్లడించారు.
రాష్ట్రంలో తాము సాగిస్తున్న ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. పోరాటం వల్లే ప్రభుత్వం విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోరాటం వల్లే ఆర్టీసీలో జీతాల పెంపు, కారుణ్య నియామకాలు జరిగాయని వివరించారు.
ఈ మహాసభల్లో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఆదాయం పెరిగితే ఆర్టీసీకి పలు విధాలుగా మేలు జరుగుతుందని అన్నారు. ఖర్చులు తగ్గించుకుంటేనే సంస్థ అప్పులు తీర్చగలం అని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తులు లీజుకు ఇస్తున్నామని, ఎవరికీ కట్టబెట్టడంలేదని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. లీజు వల్ల ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు.
ఇక, ఆర్టీసీలో కాల్ సెంటర్ 149 అమల్లోకి తెచ్చామని ఎండీ వెల్లడించారు. ప్రజలు ఈ కాల్ సెంటర్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని, ఫిర్యాదులు చేయొచ్చని వివరించారు.