Diabetes: ఈ అలవాట్లతో మధుమేహం వచ్చే రిస్క్!
- పెరుగును రోజువారీ తినాలని ఆయుర్వేదం చెప్పలేదు
- ఆకలి వేయకుండా తినడం కూడా మంచి విధానం కాదు
- రాత్రి సమయాల్లో కడుపు నిండా తినడం కూడా అనర్థమే
మధుమేహం అనేది జీవక్రియలు, జీవనశైలి గతి తప్పడం వల్ల వచ్చే సమస్య. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటే, మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. జీవన విధానం, తినే ఆహారం మధుమేహం రావడాన్ని నిర్ణయిస్తాయి. ఆయుర్వేద వైద్యులు చెబుతున్న దాని ప్రకారం మధుమేహానికి దారితీసే అలవాట్ల గురించి తప్పక అవగాహన కలిగి ఉండాలి. పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవడం.. లేదా పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ ను శరీరం సరిగ్గా వినియోగించుకోలేకపోవడాన్ని మధుమేహంగా చెబుతారు.
పెరుగు మంచి ప్రోబయాటిక్ నిలయం. రోజువారీ పెరుగును మనలో చాలా మంది తింటుంటారు. కానీ పెరుగును రోజువారీ తినాలని ఆయుర్వేదం చెప్పలేదు. రోజూ పెరుగు తినడం వల్ల బరువు పెరుగుతారు. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ వస్తుంది. జీవక్రియలు బలహీనపడతాయి. పెరుగుకు బదులు మజ్జిగ మంచిది.
రాత్రి భోజనం కడుపునిండా తినకూడదు. పైగా రాత్రి ఆలస్యంగా తినే వారు కూడా ఉన్నారు. దీనివల్ల కాలేయంపై భారం పెరుగుతుంది. జీవక్రియలు నెమ్మదిస్తాయి. అది పోషకాల లోపానికి, ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
ఆకలి లేకపోయినా మనలో కొంతమంది ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఆకలి వేయకపోయినా తినడం, సామర్థ్యానికి మించి తినడం స్థూలకాయానికి, కొలెస్ట్రాల్ కు, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆకలి సంకేతాలు లేకుండా తినడం దీర్ఘకాలంలో అనర్థాలకు దారితీస్తుంది. లేదా ప్రతి గంట లేదా రెండు గంటలకోసారి తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. అది మధుమేహానికి కారణం కావొచ్చు.