USA Economy: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా?
- రుణ పరిమితి పెంపుపై ప్రెసిడెంట్ బైడెన్, స్పీకర్ మెకార్థీల మధ్య చర్చలు
- వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో కోత పెట్టి పొదుపు చేయాలంటున్న రిపబ్లికన్లు
- పెంపు ఉండదు, కోత పెట్టబోమని అధికార డెమోక్రాట్ల వాదన
- ఇరు పక్షాల మధ్య కుదరని ఒప్పందం
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా వెళుతోందా.. అంటే ఆర్థిక నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. అధికార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్ల మధ్య రుణ పరిమితి పెంపు విషయంలో ఒప్పందం కుదరకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. ఈ విషయంపై ప్రెసిడెంట్ బైడెన్, స్పీకర్ కెవిన్ మెకార్థీల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి అంగీకారం కుదరలేదని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన మెకార్థీ అమెరికా కాంగ్రెస్ లో స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ లో రిపబ్లికన్ల మెజారిటీ కొనసాగుతుండగా సెనేట్ లో డెమోక్రాట్లకు మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రతిపాదిస్తున్న రుణ పరిమితి పెంపునకు రిపబ్లికన్ నేతలు కొర్రీలు పెడుతున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏటా 1 శాతం కోత పెట్టి ఆ మొత్తాన్ని పొదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుత బడ్జెట్ మొత్తాన్నే వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని అధికార పార్టీ చెబుతోంది. కేటాయింపులను పెంచడం కానీ, తగ్గించడం కానీ చేయబోమని బైడెన్ అంటున్నారు. దీనికి రిపబ్లికన్లు ఒప్పుకోవడంలేదు.
మరికొన్ని ఇతర విషయాల్లోనూ అభిప్రాయ భేదాల కారణంగా రుణ పరిమితి విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదరలేదు. మరో పది రోజుల్లో రుణ పరిమితి పెంచకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని నిపుణులు చెబుతున్నారు. విశ్రాంత ఉద్యోగుల పింఛన్లతో పాటు విదేశాలు కొనుగోలు చేసిన బాండ్లకు చెల్లింపులు చేయలేదని అంటున్నారు. అదే జరిగితే అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతుందని, ప్రపంచాన్ని కూడా సంక్షోభంలోకి నెడుతుందని అమెరికా ఆర్థిక మంత్రి జెనెట్ యెలెన్ చెప్పారు. ఇదే విషయం చెబుతూ అమెరికన్ కాంగ్రెస్ కు ఆయన లేఖ రాశారు.