India: దేవాలయాలపై దాడులకు దిగేవారిపై కఠిన చర్యలు.. మోదీకి మాటిచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని

India Australia Vow Strict Action Against Temple Vandalism

  • ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని ఆంథోనీతో మోదీ భేటీ
  • హిందూ దేవాలయాలపై దాడుల అంశంపై సమావేశంలో ఇరు దేశాధినేతల చర్చ
  • దేవాలయాలపై దుశ్చర్యలకు దిగినవారిపై కఠిన చర్యలకు ఆస్ట్రేలియా ప్రధాని హామీ
  • పునరుత్పాదక ఇంధనాలు, వాణిజ్యం , రక్షణ రంగంపైనా చర్చ

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుశ్చర్యలకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తనకు హామీ ఇచ్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పేర్కొన్నారు. ప్రస్తుతం మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధనాలు, వాణిజ్యం, రక్షణరంగం తదితర అంశాలపై చర్చించారు. 

హిందూ దేవాలయాలపై దుశ్చర్యలకు సంబంధించిన అంశం కూడా తమ మధ్య చర్చకు వచ్చినట్టు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుశ్చర్యల గురించి ఆస్ట్రేలియా ప్రధాని, నేను గతంలోనూ చర్చించాము. నేడు కూడా ఈ విషయమై మరోమారు మాట్లాడాం’’ అని మోదీ తెలిపారు. హిందూ దేవాలయాలపై అవమానకర రాతలు రాస్తూ దుశ్చర్యలకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని తనకు హామీ ఇచ్చినట్టు మోదీ తెలిపారు. 

‘‘ఆస్ట్రేలియా, భారత్ మధ్య స్నేహపూర్వక సంబంధాలను చెడగొట్టే ఎటువంటి ప్రయత్నాలను మేము సహించం. హిందూ దేవాలయాలపై దాడులకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని నేడు మరోసారి హామీ ఇచ్చారు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాలోని ప్రముఖ స్వామి నారాయణ్ దేవాలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు అభ్యంతరకర రాతలు రాసిన విషయం తెలిసిందే. అంతకుమునుపు మరో మూడు హిందూ దేవాలయాలపై దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News