AAP: కేంద్రం ఆర్డినెన్స్‌పై ‘ఆప్’కు మద్దతుగా కాంగ్రెస్
- సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వారం రోజులకే కేంద్రం ఆర్డినెన్స్
- అధికారుల బదిలీలను చెప్పుచేతల్లోకి తీసుకున్న కేంద్రం
- ఆర్డినెన్స్‌పై పోరాటంలో కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం
ఢిల్లీలోని ప్రభుత్వ అధికారుల బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కేజ్రీవాల్ సారథ్యంలోని ‘ఆప్’ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యు అండ్ దాద్రా అండ్ నాగర్ హవేలి (సివిల్) సర్వీసెస్ (డీఏఎన్ఐసీఎస్) కేడర్‌లోని గ్రూప్-ఎ అధికారుల బదిలీలు, క్రమశిక్షణ చర్యల కోసం నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ పేరుతో కేంద్రం ఇటీవల ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
పోలీసులు, పబ్లిక్ ఆర్డర్, భూమికి సంబంధించిన వాటిని మినహాయించి ఢిల్లీలో సేవల నియంత్రణను ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికే అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే, ఆ తర్వాత వారం రోజులు కూడా గడవకముందే కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాకిచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేజ్రీవాల్ సర్కారు మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆర్డినెన్స్‌పై పోరాడుతున్న కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. కొత్త ఆర్డినెన్స్‌ను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఓడిన వారి చర్య కాక మరోటి కాదని తూర్పారబట్టారు.