Karnataka: సిద్ధరామయ్య సహా మంత్రులందరూ నేరచరితులే: ఏడీఆర్
- కోటీశ్వరుల జాబితాలో సీఎం సహా 9 మంది మంత్రులు ఉన్నట్టు నివేదిక
- మంత్రుల సగటు ఆస్తి రూ. 229.27 కోట్ల పైమాటే
- సీఎం సిద్ధరామయ్యపై 13 క్రిమినల్ కేసులు
కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, సిద్ధరామయ్య నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ కొత్త ప్రభుత్వంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సంచలన నివేదిక వెల్లడించింది. సీఎం సహా కేబినెట్‌లోని 9 మంది మంత్రులూ నేర చరితులేనని పేర్కొంది. కోటీశ్వరుల జాబితాలో తొమ్మిదిమంది మంత్రులు ఉన్నారని, వారి సగటు ఆస్తుల విలువ రూ. 229.27 కోట్లపైమాటేనని పేర్కొంది.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యధికంగా రూ. 1,413 కోట్ల ఆస్తులు ఉండగా, చిత్తాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రియాంక్ ఖర్గే రూ. 16.83 కోట్లతో ఈ జాబితాలో చివరన ఉన్నారు. అలాగే, నలుగురు మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.
సిద్ధరామయ్యపై మొత్తం 13 కేసులు నమోదు కాగా, అందులో ఆరు కేసులు తీవ్రమైనవి. డీకే శివకుమార్‌పై 19 కేసులు నమోదు కాగా, అందులో 6 తీవ్రమైనవి ఉన్నాయి. అలాగే, లక్ష్మణ్‌రావుపై 2, ఎంబీ పాటిల్‌పై 5, రామలింగారెడ్డిపై 4, బీజే జమీర్ అహ్మద్‌ఖాన్‌పై 5, కేహెచ్ మునియప్పపై ఒకటి, డాక్టర్ జి. పరమేశ్వరపై 3, ప్రియాంక ఖర్గేపై 9 కేసులు ఉన్నాయి.