sarath babu: సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత!

film actor sarath babu passed away

  • హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన శరత్ బాబు
  • అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తొలుత బెంగుళూరులో చికిత్స
  • తర్వాత హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన శరత్ బాబు
  • పరిస్థితి విషమించి ఈరోజు మధ్యాహ్నం మృతి


సీనియర్ సినీ నటుడు శరత్ బాబు (71) ఇకలేరు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. నెల రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించి, మధ్యాహ్నం చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్కాచెళ్లెళ్లు ఉన్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆయన్ను కుటుంబ సభ్యులు సత్యంబాబుగా పిలిచే వారు. 

1974లో రామరాజ్యం సినిమాతో హీరోగా శరత్ బాబు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించారు. తన 50 ఏళ్ల సినీ కెరియర్ లో 250కి పైగా చిత్రాల్లో కనిపించగా.. అందులో 70కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు.

భాష ఏదైనా శరత్ బాబే డబ్బింగ్ చెప్పుకునే వారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, గుప్పెడు మనసు, అభినందన, నోము, మూడు ముళ్ల బంధం, కాంచన గంగ, అగ్నిగుండం, ఇది కథ కాదు, సీతాకోక చిలుక, జీవన పోరాటం, యమకింకరుడు, అమరజీవి, ముత్తు, వంటి ఎన్నో సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి.

బుల్లితెరపై అంతరంగాలు, ఎండమావులు తదితర సీరియల్స్ లోనూ శరత్ బాబు నటించారు. ఆయన చివరిసారిగా ‘వకీల్ సాబ్’ సినిమాలో కనిపించారు. త్వరలో రిలీజ్ కానున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించారు.

sarath babu
film actor
passed away
  • Loading...

More Telugu News