Nara Lokesh: ఇప్పుడు ఏపీలో ఉన్నది ఒకే ఒక్క మైనింగ్ కంపెనీ: లోకేశ్
- యువగళం పాదయాత్రకు నేడు 106వ రోజు
- బనగానపల్లెలో లోకేశ్ పాదయాత్ర
- గ్రానైట్ పరిశ్రమదారులు, కార్మికులతో ముఖాముఖి
- జగన్ చెత్త నిర్ణయాలతో కార్మికులు రోడ్డునపడ్డారని ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 106వ రోజు బనగానపల్లి నియోజకవర్గంలో జనసంద్రాన్ని తలపించింది. ఆముదాలమిట్ట శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారు.
ఈ మధ్యాహ్నం ఆముదాల మిట్ట క్యాంప్ సైట్ లో గ్రానైట్ పరిశ్రమదారులు, కార్మికులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. దారిపొడవునా కుందూనది పోరాట సమితి నాయకులు, ఆర్యవైశ్యులు, రైతులు, వివిధ గ్రామాల ప్రజలు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.
మైనింగ్ యజమానులు, కార్మికులతో లోకేశ్ ముఖాముఖి
ఏపీలో 'జగన్ మైనింగ్ కార్పొరేషన్' (జేఎంసీ) తప్ప మరెవరూ మైనింగ్ చేయకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు. బనగానపల్లె నియోజకవర్గం అముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ లో మైనింగ్ యజమానులు, కార్మికులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగైన మైనింగ్ పాలసీ తీసుకొచ్చి, పన్నుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి, తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేసుకునే వాతావరణం తీసుకొస్తామని వెల్లడించారు.
"మైనింగ్ ని ఇండస్ట్రీగా గుర్తించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన చెత్త జీవోలు అన్నీ రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఫ్యాక్టరీలు ఉన్నాయి. మైనింగ్ లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. వారికి మెరుగైన జీతాలు, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ సదుపాయం, ప్రమాద బీమా అందించేలా చర్యలు తీసుకుంటాం" అని వివరించారు.
జగన్ చెత్త నిర్ణయాలతో రోడ్డునపడ్డ కార్మికులు
జగన్ చెత్త నిర్ణయాల వలన దాదాపు 30 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని లోకేశ్ విమర్శించారు. జగన్ అండ్ కో రాష్ట్రంలో ఉన్న మైనింగ్ యజమానులను బెదిరించి అన్ని మైన్లు లాక్కున్నారని మండిపడ్డారు.
"మైన్ల యజమానులపై అక్రమ కేసులు, ఫైన్లు వేసి వేధించి మైన్లు అన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్నోతరాలుగా ఉన్న మైనింగ్ కంపెనీలు అన్నీ ఇప్పుడు లేవు ఇప్పుడు ఏపీ లో ఉన్నది ఒకే ఒక్క మైనింగ్ కంపెనీ అది జగన్ మైనింగ్ కార్పొరేషన్. చట్టాలను గౌరవించరు, రూల్స్ పాటించరు, ఆఖరికి కోర్టు ఆర్డర్లను, కంటెంప్ట్ నోటీసులను కూడా అధికారులు చెత్త బుట్టలో వేస్తున్నారు. దీని వలన మైనింగ్ పాలసీల మీద యజమానులకు నమ్మకం పోతుంది" అని పేర్కొన్నారు.
గ్రానైట్ పరిశ్రమదారుల పాలిట యముడు!
కన్సిడరేషన్ టాక్స్ , సెక్యూరిటీ డిపాజిట్ టాక్స్, ప్రీమియం టాక్స్, రాయల్టీ తగ్గించి మైక్రో, స్మాల్ మైనింగ్ ఫ్యాక్టరీలను ఆదుకుంటామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు గ్రానైట్ పరిశ్రమదారుల పాలిట యముడిలా తయారయ్యాడని లోకేశ్ విమర్శించారు.
"టీడీపీ హయాంలో రాయల్టీ 8 నుంచి 5 శాతానికి తగ్గించాం. డీఎంఎఫ్ 30% నుండి 10% తగ్గించాం. టీడీపీ హయాంలో ఎప్పుడూ మిమ్మల్ని వేధించలేదు. మీ మైన్లు లాక్కోలేదు. జగన్ మైనర్ మైనింగ్ ని విధ్వంసం చెయ్యడానికి నవ దరిద్రాల పాలసీ తీసుకొచ్చాడు.
జీవో నెం.42 తెచ్చి రాయల్టీని 100 శాతం పెంచాడు. జీవో నెం.65 తెచ్చి డెడ్ రెంట్ ని 10 రెట్లు పెంచేసాడు. టీడీపీ హయాంలో హెక్టారుకు రూ.40 వేలు ఉంటే ఇప్పుడు రూ.5.20 లక్షలకు పెంచేశాడు. జీవో నెం. 65 తెచ్చి సెక్యూరిటీ డిపాజిట్ ని 3 రెట్లు పెంచేసాడు. జీవో నెం.90 తెచ్చి 60 శాతం మైనింగ్ కంపల్సరీ చేసి ముందే పన్ను వసూలు చేస్తున్నారు. జీవో నెం.13 తెచ్చి ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ ఆపరేషన్స్ ఫీజుని భారీగా పెంచేసింది ఈ ప్రభుత్వం.
జీవో నెం.63 తెచ్చి తమ అనుయాయులకు రాయల్టీ వసూలు హక్కు కట్టబెట్టాడు. జీవో నెం.13 & 14 తెచ్చి మైనర్ మినరల్స్ కి ఆక్షన్ పాలసీ తీసుకొచ్చారు. ఆర్టీఐలో పెట్టిన ఒక్క అప్లికేషన్ కు కూడా ప్రభుత్వం నుండి సమాధానం రావడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సరళ తరమైన మైనింగ్ పాలసీని తెచ్చి గ్రానైట్ యజమానులు, కార్మికుల కష్టాలు తీరుస్తాం" అని భరోసా ఇచ్చారు.
*యువగళం వివరాలు:*
*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1363.6 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 17.0 కి.మీ.*
*107వ రోజు (22-5-2023) పాదయాత్ర వివరాలు:*
*ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)*
మధ్యాహ్నం
2.00 – దొర్నిపాడు క్యాంప్ సైట్ లో బలిజ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.50 – దొర్నిపాడు శివార్లలో స్థానికులతో మాటామంతీ.
5.00 – దొర్నిపాడు బస్టాండు వద్ద రైతులతో సమావేశం.
5.05 – దొర్నిపాడు కృష్ణదేవరాయ సెంటర్ లో స్థానికులతో సమావేశం.
5.10 – దొర్నిపాడు హెచ్.డబ్ల్యు సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
5.50 – రామచంద్రాపురంలో స్థానికులతో సమావేశం.
5.55 – రామచంద్రాపురం కె.సి కెనాల్ వద్ద రైతులతో సమావేశం.
6.25 – భాగ్యనగరంలో స్థానికులతో సమావేశం.
7.30 – చింతకుంట దేవరాయపురంలో స్థానికులతో మాటామంతీ.
8.00 – పెద్ద చింతకుంటలో నరేగా వర్కర్లతో సమావేశం.
8.30 – ఆళ్లగడ్డ అపర్ణ ఇన్ ఫ్రా వెంచర్ వద్ద విడిది కేంద్రంలో బస.
******