Kishan Reddy: మా ప్లాన్ మాకు ఉంది.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

kavitha arrest is not in our hands says kishan reddy

  • రూ.2 వేల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారన్న కిషన్ రెడ్డి 
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదని వ్యాఖ్య
  • ఆధారాలున్నాయి కాబట్టే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిందని వెల్లడి
  • ఫ్లెక్సీలు పెట్టించుకున్నంత మాత్రాన దేశానికి నేత కాలేరని కేసీఆర్ పై సెటైర్లు 

రూ.2 వేల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘నోట్ల రద్దు విషయంలో మా ప్లాన్ మాకు ఉంది’’ అని చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదని, సీబీఐ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. ‘‘ఆధారాలున్నాయి కాబట్టే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను సైతం జైలుకు పంపించాం’’ అని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు నిరాధారమని చెప్పారు. తామంతా ఒకే కుటుంబమని, తమ జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సహజమని అన్నారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను ఎంఐఎం ‌పార్టీ నడిపిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘కర్ణాటక ఎన్నికల‌ ప్రభావం తెలంగాణలో ఉండదు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

దేశ్ కీ నేత అని ఫ్లెక్సీలు పెట్టించుకుంటే సీఎం కేసీఆర్ దేశానికి నేత కాలేరని, ప్రజలు గుర్తిస్తేనే అవుతారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిస్థితి ఉట్టికెగుర లేనమ్మ ఆకాశానికెగిరిన్నట్లు ఉందని విమర్శించారు. మహారాష్ట్రలో కొంత మంది పనికిమాలిన వాళ్లకు ఫోన్లు చేస్తూ పార్టీలో చేర్చుకుంటూ ప్రధానిని విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి పొద్దున లేస్తే ప్రధాని మోదీని విమర్శించడమే పనని మండిపడ్డారు.

Kishan Reddy
Delhi Liquor Scam
K Kavitha
BRS
CBI
BJP
  • Loading...

More Telugu News