Singapore: ఎవరెస్ట్ పర్వతం దిగివస్తూ భారత సంతతి వ్యక్తి అదృశ్యం
- పర్వతారోహణ కోసం నేపాల్ వెళ్లిన సింగపూర్ వాసి శ్రీనివాస్ సైనీస్ దత్తాత్రేయ
- శిఖరం చేరుకున్నానంటూ శుక్రవారం భార్యకు ఫోన్
- తిరిగి రాలేకపోతున్నానని ఆవేదన
- శనివారం బేస్ క్యాంప్‌తో తెగిపోయిన సంబంధాలు
- శ్రీనివాస్ ఆచూకీ కనిపెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగాలని కుటుంబసభ్యుల వినతి
ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన ఓ భారత సంతతి వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యమైపోయారు. సింగపూర్‌కు చెందిన శ్రీనివాస్ సైనీస్ దత్తాత్రేయ(39) ఎవరెస్ట్ శిఖరం చేరుకున్నాక కిందకు దిగుతూ కనిపించకుండా పోయారు. ఆయన కుటుంబ సభ్యులు శ్రీనివాస్ ఆచూకీ కనిపెట్టేందుకు తాజాగా ప్రభుత్వ సాయం కోరారు. ఈ మేరకు change.org వెబ్‌సైట్‌లో ఓ పిటిషన్ పెట్టారు.
శ్రీనివాస్ బంధువు దివ్యా భరత్ తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఏప్రిల్ 1న ఎవరెస్ట్ పర్వతం ఎక్కేందుకు నేపాల్ వెళ్లారు. కాగా, శుక్రవారం పర్వత శిఖరం చేరుకున్నాక శ్రీనివాస్ తన భార్యకు ఫోన్ చేశారు. కిందకు దిగి రాలేకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కిందకువస్తున్న సమయంలో ఆయనకు బేస్ క్యాంప్‌తో సంబంధాలు తెగిపోయాయి. పర్వతంపై శీతలవాతావరణం కారణంగా శ్రీనివాస్ అనారోగ్యం పాలై ఉంటారని ఆయన బంధువు దివ్య అనుమానిస్తున్నారు. తన బృందం వెంటే దిగాల్సిన ఆయన వెనకబడిపోయి ఉంటారని చెప్పారు.
‘‘శిఖరం చేరుకున్నాక నా భర్త శాటిలైట్ ఫోన్లో నాతో మాట్లాడారు. కిందకు దిగి రాలేకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు’’ అని శ్రీనివాస్ భార్య తెలిపారు. సింగపూర్ మీడియా కథనాల ప్రకారం, శనివారం షెర్పాల (పర్వాతారోహకులు) బృందం ఒకటి శనివారం ఉదయమే గాలింపు చర్యలు దిగింది. ప్రత్యేక బృందాలతో శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని నేపాల్ ప్రభుత్వాన్ని ఆయన బంధువులు కోరారు. సహాయక చర్యలకు దౌత్యపరమైన నిబంధనలు అడ్డురాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.