bichagadu: రూ.2 వేల నోట్లకు, ‘బిచ్చగాడు’కి లింకేంటి?
- 2016లో వచ్చిన బిచ్చగాడు.. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు
- రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటామని నిన్న ప్రకటించిన ఆర్ బీఐ
- అదే రోజున రిలీజ్ అయిన బిచ్చగాడు 2
- రెండింటికీ ముడిపెడుతూ ట్వీట్లు చేస్తున్న నెటిజన్లు
దాదాపు ఏడేళ్ల కిందట విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయానికి ముడిపెడుతున్నారు.
తెలుగులో 2016 మే 13న బిచ్చగాడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత సుమారు ఐదారు నెలలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న ‘బిచ్చగాడు 2’ సినిమా రిలీజ్ అయింది. అదే రోజే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) ప్రకటించింది. రెండు సంఘటనలూ యాదృచ్ఛికంగానే జరిగినా.. రెండింటికీ ముడిపెడుతూ.. సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొంత మంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
‘బిచ్చగాడు 3’ రాకుండా చూసుకోండయ్యా అని ట్వీట్లు చేస్తున్నారు. ‘విజయ్ ఆంటోనీని ఇక బిచ్చగాడు సినిమాలు తియ్యవద్దని చెప్పాలి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘బిచ్చగాడు టైమ్ లో 500/1000 నోట్ల ఉపసంహరణ.. బిచ్చగాడు-2 రిలీజ్ టైమ్ కి 2000 నోట్ల ఉపసంహరణ.. ఈ లింకేమిటి సామీ?’’ అని మరొకరు ట్వీట్ చేశారు.