Chandrababu: ఎఫ్ డీఐలను రాబట్టడంలో ఏపీ ఒకప్పుడు టాప్-5లో ఉండేది: చంద్రబాబు
- ఎఫ్ డీఐలను రాబట్టడంలో ఏపీ అట్టడుగుకు పడిపోయిందన్న బాబు
- ఏపీ ర్యాంకు ప్రస్తుతం 14 అని వెల్లడి
- ఏపీకి ఇలాంటి పాలకులు వద్దని పిలుపు
సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ)ను ఆకర్షించడంలో ఏపీ ఒకప్పుడు టాప్-5 రాష్ట్రాల్లో ఉండేదని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఎఫ్ డీఐలను రాబట్టడంలో ఏపీ అట్టడుగుకు పడిపోయిందని, ప్రస్తుతం ఏపీ ర్యాంకు 14 అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
ఏపీలో పెట్టుబడులపై ఒక్క పెట్టుబడిదారుడిలోనూ భరోసా కలగడంలేదని పేర్కొన్నారు. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన సీఎం జగన్ తన సంపద గురించే తపన పడుతున్నారని, సొంతడబ్బా గురించే ఆలోచిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ఎఫ్ డీఐల విషయంలో జగన్ పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, ఎఫ్ డీఐలు వస్తే ఏపీ యువతకు ఉద్యోగాలు వస్తాయన్న పట్టింపే లేదని పేర్కొన్నారు. ఏపీకి ఇలాంటి పాలకులు మాత్రం వద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు.