NTR: యుద్ధభూమిలో కలుద్దాం మిత్రమా!.. ఎన్టీఆర్ ను విష్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసిన హృతిక్ రోషన్

hrithik roshan tweeted about ntr and confirmed that ntr is doing war 2

  • పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ ఎన్టీఆర్ ను విష్ చేసిన హృతిక్ రోషన్
  • ‘వార్2’ సినిమాపై హింట్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్
  • ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పోటెత్తుతున్నాయి. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అది కూడా తెలుగులో చెప్పారు. అయితే ఆయన చేసిన ట్వీట్ లో ఓ విషయంలో హింట్ కూడా ఇచ్చారు.

‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్. ఈ సంతోషకరమైన రోజును నువ్వు ఎంజాయ్ చేయాలని, రాబోయే సంవత్సరంలో పూర్తి యాక్షన్ ప్యాక్ తో సాగాలని కోరుకుంటున్నా. యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా. మనం కలిసేంత వరకు నీకు ప్రతి రోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు. చివర్లో ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’ అని పేర్కొన్నారు.

ఓ వైపు విష్ చేస్తూనే ‘వార్ 2’ గురించి హృతిక్ హింట్ ఇచ్చారు. ‘వార్’లో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. అందులో టైగర్ ష్రాఫ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు. అయితే అధికార ప్రకటన ఇంకా రాలేదు. ‘యుద్ధభూమిలో కలుద్దాం’, ‘నేను కలిసేంత వరకే నీకు ప్రశాంతత’ అంటూ హృతిక్ చేసిన కామెంట్లు ‘వార్ 2’ను ఉద్దేశించేనని తెలుస్తోంది.

వార్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉంటాయి. టైగర్, హృతిక్ పోటీ పడి నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. బాక్సాఫీస్ రికార్డులు బద్ధలే. ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం ఈ సినిమాతోనే అని భావించవచ్చు. బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ దీనికి దర్శకుడు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాను ఎన్టీఆర్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా నిన్ననే ప్రకటించారు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు.

More Telugu News