Umran Malik: విమర్శల సుడిగుండంలో సన్ రైజర్స్ హైదరాబాద్
- ఆటగాళ్ల సేవలను సరిగ్గా వినియోగించుకోవడం తెలియదన్న విమర్శలు
- వారికి మద్దతుగా నిలిచే వాతావరణం అవసరమన్న సూచనలు
- ఫ్రాంచైజీ తీరును ఏకిపారేస్తున్న మాజీ ఆటగాళ్లు
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి స్థానాన్ని ఖాయం చేసుకుంది. 13 మ్యాచులకు గాను కేవలం నాలుగింటిలోనే గెలిచిన సన్ రైజర్స్.. గురువారం బెంగళూరు చేతిలోనూ ఓటమి చవిచూసింది. ఇక చివరిగా వచ్చే ఆదివారం ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విమర్శల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ జట్టుకు విమర్శలు కొత్త కాకపోయినా, వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఐపీఎల్ లో అత్యంత చెత్త రికార్డు ఈ ఫ్రాంచైజీ పేరుతోనే ఉంది. వరుసగా కెప్టెన్లను మార్చడం, ఆటగాళ్లను మార్చడం సన్ రైజర్స్ కు అలవాటుగా మారిపోయింది. దీంతో జట్టులో ఓ స్థిరత్వం లేదు. సరైన సమన్వయం లేదు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా లేవు.
ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలు, ఈ ఫ్రాంచైజీని లక్ష్యంగా చేసుకుని మాజీ బౌలర్లు యూసఫ్ పఠాన్, జహీర్ ఖాన్ చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది. సన్ రైజర్స్ ఉమ్రాన్ మాలిక్ ను తప్పించడాన్ని యూసఫ్ పఠాన్, జహీర్ ఖాన్ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సీజన్ ఆరంభంలో వరుస మ్యాచుల్లో ఉమ్రాన్ మాలిక్ ను ఆడనివ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
‘‘గతేాడాది ఉమ్రాన్ అద్భతంగా ఆడాడు. ఆ ఘనతను మీరు తీసుకున్నారు. ఈ ఏడాది అతడికి మీ మద్దతు కావాలి. మరి అతడికి మద్దతు లభించిందా? అతడి సేవలను సరైన విధంగా ఉపయోగించుకున్నారా? అతడు యువ బౌలర్. భారత్ భవిష్యత్తు బౌలర్. అతడ్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఫ్రాంచైజీలో చాలా మంది ప్లేయర్ల విషయంలోనూ ఇదే తీరు ఉందని చెప్పొచ్చు. అభిషేక్ శర్మ గతేడాది ఓపెనర్ గా మంచి ఫలితాలను ఇచ్చాడు. కానీ, ఈ ఏడాది అతడి బ్యాటింగ్ స్థానాలను ఇష్టారీతిన మార్చేశారు. ఒక దశలో బెంచ్ పైనా కూర్చోబెట్టారు. మీరు ప్రత్యర్థి మనసు నుంచి పనిచేస్తున్నారు. మీ ఆటగాళ్ల మనసు వైపు నుంచి ఆలోచించడం లేదు’’ అని పఠాన్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.
జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయంలో ఉమ్రాన్ మాలిక్ ను ఫ్రాంచైజీ సరిగ్గా ఉపయోగించుకోలేదు. అతడికి అనుకూలమైన, మద్దతుతో కూడిన వాతావరణం అవసరం. అతడికి సరైన మార్గదర్శనం కావాలి’’ అని చెప్పాడు. అంతెందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలకు సైతం ప్రాధాన్యం ఏర్పడింది. గత వారం గుజరాత్ జట్టు చేతిలో ఓటమి తర్వాత అతడు మాట్లాడుతూ.. వాళ్లు అనుమతిస్తే మిగిలిన మ్యాచుల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పాడు. వారు అనుమతిస్తే అన్న వ్యాఖ్య వెనుక.. టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయాలే ఫలితాలకు కారణమని తెలుస్తోంది. ఆటగాళ్ల విషయంలో కెప్టెన్ కు స్వేచ్ఛ లేదని తేలిపోయినట్టు పలువురు విమర్శిస్తున్నారు.