Zepto: ఒక్క నెలలో రూ.25 కోట్ల మామిడి పండ్లకు ఆర్డర్లు
- జెప్టో ప్లాట్ ఫామ్ లో రికార్డు స్థాయిలో ఆర్డర్లు
- 30 శాతం అమ్మకాలు ఆల్ఫాన్సో రకానివే
- 25 శాతం అమ్మకాలతో బంగినపల్లి రెండో స్థానం
పండ్లలో రారాజుగా మామిడికి పేరు. వేసవి వచ్చిందంటే తియ్యనైన, రుచికరమైన మామిడి పండ్లను తినని వారుండరు. మన దేశంలో మామిడి దిగుబడి దాదాపుగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు వస్తుంటుంది. అధిక వినియోగం ఏప్రిల్ నుంచి మే నెల వరకు నమోదవుతుంది. మామిడి పండ్లను ప్రజలు ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో తెలుసుకోవాలంటే, ఇన్ స్టంట్ గ్రోసరీ డెలివరీ సంస్థ జెప్టో విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించాల్సిందే.
ఏప్రిల్ నెలలో రూ.25 కోట్ల విలువ చేసే మామిడి పండ్లకు జెప్టో ప్లాట్ ఫామ్ లో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వచ్చాయి. సగటున రోజువారీగా రూ.60 లక్షల విలువ చేసే ఆర్డర్లను జెప్టో స్వీకరించింది. ఏప్రిల్ కంటే మే నెలలో మరింత అధికంగా ఆర్డర్లు వస్తాయని జెప్టో అంచనా వేస్తోంది. పచ్చి మామిడి కాయలకు సైతం డిమాండ్ ఎక్కువే ఉంది. ఏప్రిల్ నెలలో రూ.25 లక్షల విలువ చేసే మామిడి కాయలకు జెప్టోలో ఆర్డర్లు వచ్చాయి. మామిడి కాయలతో పచ్చడి పెట్టుకోవడం, కూరల్లో వేసుకోవడం తెలిసిందే.
జెప్టోలో ఎక్కువగా ఏ మామిడి పండ్లకు ఆర్డర్లు వచ్చాయో తెలుసా..? మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో పండే ఆల్ఫాన్సో రకానికే. మొత్తం మామిడి పండ్ల విక్రయాల్లో 30 శాతం ఆల్ఫాన్సోవే ఉన్నాయి. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వాసులు వీటి కోసం ఎక్కువగా ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బంగినపల్లి రెండో స్థానంలో ఉంది. మొత్తం మామిడి పండ్లలో 25 శాతం విక్రయాలు ఈ రకానివే ఉన్నాయి. దక్షిణాది వాసులు ఎక్కువగా ఈ రకం కోసం ఆర్డర్ పెట్టారు. ఆ తర్వాత కేసర్ రకానికి డిమాండ్ కనిపించింది. జెప్టో సంస్థ దేశవ్యాప్తంగా 1,000 మంది మామిడి రైతులతో సరఫరా ఒప్పందాలు చేసుకుంది.