Tollywood: సీనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. కరాటే కల్యాణికి నోటీసులు ఇచ్చిన ‘మా’

MAA issues notice to Karate Kalyani

  • ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును తప్పుబట్టిన కల్యాణి
  • విగ్రహం ఆవిష్కరణను నిలిపివేయాలని డిమాండ్
  • కల్యాణి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కన్నెర్రజేసింది. దివంగత సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కల్యాణికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. 

కాగా, అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కరాటే కల్యాణి.. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తప్పు పట్టారు. 

దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి విగ్రహంతో క‌మ్మ‌, యాద‌వుల‌తో ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేయొద్దన్నారు. దీన్ని సమాజంలో అలజడులను సృష్టించే ప్రక్రియ అంటూ ఆరోపించారు. అయితే, కల్యాణి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీనిపై కల్యాణి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

Tollywood
MAA
Karate Kalyani
Manchu Vishnu
notice
NTR
  • Loading...

More Telugu News