Amitabh Bachchan: బైకులపై షూటింగ్ లొకేషన్లకు అమితాబ్, అనుష్క.. హెల్మెట్‌ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!

Mumbai Traffic Police Takes Note Of Amitabh Bachchan and Anushka Sharmas Helmet Less Pics

  • ట్రాఫిక్‌ రద్దీలో ఇరుక్కుపోయి.. బైక్ లపై వెళ్లిన అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ 
  • హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించడంపై విమర్శలు
  • చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ లో పోలీసులకు ఫిర్యాదులు

రెండు రోజుల క్రితం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ షూటింగ్‌ కు వెళ్తూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఓ బైకర్‌ను లిఫ్ట్‌ అడిగి ఆయన లొకేషన్‌కు చేరుకున్నారు. నటి అనుష్క శర్మ కూడా ట్రాఫిక్‌ రద్దీ కారణంగా తన బాడీగార్డ్‌తో కలిసి బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

అయితే బైక్‌పై వెళ్తున్న సమయంలో వారు హెల్మెట్‌ ధరించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో నెటిజన్లు వారిద్దరి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘హెల్మెట్‌ ఎక్కడ?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. చట్టం, నిబంధనలు సామాన్యులకేనా? అని నిలదీస్తున్నారు. బైక్‌ నడిపే వారే కాకుండా, వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలనే నిబంధన ముంబయి పోలీసులు అమలు చేస్తుండటమే ఇందుకు కారణం. 

కొంత మంది ఈ ఫొటోలను ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ట్యాగ్‌ చేసి ‘చర్యలు తీసుకోవాలి’ అని కోరుతున్నారు. నెటిజన్ల పోస్టులకు పోలీసులు స్పందించారు. ‘‘చర్యలు తీసుకునేందుకు కచ్చితమైన లొకేషన్‌ వివరాలను అందజేయండి’’ అని నెటిజన్లను కోరారు.

More Telugu News