PV Sindhu: సుదిర్మన్ కప్ లో సింధు ఓటమి... టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత్!

PV Sindhu lost in Sudirman Cup

  • మహిళల సింగిల్స్ లో సింధుకు చుక్కెదురు
  • రెండో రౌండ్ లో సింధును ఓడించిన మలేసియా అమ్మాయి
  • ఈ ఉదయం జరిగిన పోటీల్లో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప-ధృవ్ కపిల పరాజయం 

చైనాలోని సుజౌలో జరుగుతున్న సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు నిరాశాజనక ప్రదర్శన కనబర్చారు. స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్ లోనే పరాజయం పాలైంది. మలేసియా అమ్మాయి గోహ్ జిన్ వీ తో జరిగిన గ్రూప్-సి పోరులో సింధు హోరాహోరీ పోరాడినా ఫలితం దక్కలేదు. 

మూడు గేముల పాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు 21-14, 10-21, 20-22తో గోహ్ జిన్ వీ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్ ను సునాయాసంగా గెలిచిన సింధు... రెండో గేమ్ లో అనూహ్య ప్రతిఘటన ఎదుర్కొంది. గోహ్ జిన్ వీ ఆ గేమ్ ను 21-10తో కైవసం చేసుకుంది. మూడో గేమ్ ఆరంభంలో గోహ్ దూకుడు కనబర్చడంతో ఓ దశలో సింధు 1-13తో వెనుకబడింది. 

అయితే విశేష రీతిలో పుంజుకున్న సింధు స్కోరు సమం చేయడమే కాదు మ్యాచ్ ను చేజిక్కించుకుంటుందన్న ఆశలు కలిగించింది. స్కోరు 20-20తో సమం అయిన స్థితిలో మలేసియా షట్లర్ గోహ్ తిరుగులేని ఆటతీరుతో రెండు పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 

అంతకుముందు, అశ్విని పొన్నప్ప-ధృవ్ కపిల జోడీ మలేసియా షట్లర్లు గోహ్ సూన్ హువాత్-లాయ్ షెవోన్ జెమీ చేతిలో 16-21, 17-21తో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్ లో తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ కూడా ఓటమి బాటలో పయనించాడు. కిదాంబి శ్రీకాంత్ 16-21, 11-21తో మలేసియా షట్లర్ లీ జీ జియా చేతిలో ఓడిపోయాడు.

PV Sindhu
Sudirman Cup
Goh Jin Wei
India
Malaysia
  • Loading...

More Telugu News