Nandini Reddy: తిరుపతిలో విలేకరుల సమావేశంలో గొడవపై దర్శకురాలు నందినిరెడ్డి క్లారిటీ

Director Nandini Reddy Gave Clarity About Tirupati Issue
  • ‘అన్నీ మంచి శకునములే’ ప్రమోషన్స్‌లో భాగంగా తిరుపతిలో విలేకరుల సమావేశం
  • సంతోష్ శోభన్ మాట్లాడుతుండగా అడ్డుకుని పరిచయం చేసుకోవాలన్న ఓ విలేకరి
  • నటీనటులు, వైజయంతీ బ్యానర్, చేసిన సినిమాల గురించి వివరించానన్న నందినిరెడ్డి
  • ప్రెస్‌మీట్‌కు వచ్చేముందు సినిమా గురించి తెలుసుకుని రావాలన్న దర్శకురాలు
తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో గొడవ జరిగిందంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ నందినిరెడ్డి స్పందించారు. ఆ రోజు అసలేం జరిగిందో చెబుతూ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇటీవల తిరుపతి వెళ్లింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని విలేకరులకు సమాచారం వెళ్లడంతో వారు అప్పటికే సిద్ధంగా ఉన్నారు. 

అయితే, చిత్రబృందం గంటన్నర ఆలస్యంగా చేరుకుంది. అనంతరం సంతోష్ శోభన్ మాట్లాడేందుకు మైక్ అందుకోగానే ఓ విలేకరి జోక్యం చేసుకొని మీరెవరో తమకు తెలియదని, తొలుత పరిచయం చేసుకోవాలని అన్నాడని, ఆయన మాటలు తనకు ఇబ్బందిగా ఉండడంతో మైక్ తీసుకుని నటీనటులు, వైజయంతీ బ్యానర్, తన గురించి, తాము చేసిన సినిమాల గురించి వివరించినట్టు నందిని రెడ్డి తెలిపారు.

ఆ తర్వాత సంతోష్‌ను పిలిచి ఎందుకైనా మంచిదని నువ్వు కూడా పరిచయం చేసుకోవాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు. తాను అన్న ఆ మాట సదరు విలేకరికి నచ్చలేదని, అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడని తెలిపారు. దీంతో తాను కల్పించుకుని ‘‘మేం ఎన్నిసార్లు చెప్పాలో, ఏం చెప్పాలో కూడా మీరే చెబుతారు. కాబట్టి నాదో రిక్వెస్ట్.. ప్రెస్‌మీట్‌కు వచ్చినప్పుడు సినిమా ఏంటి? ఎవరు చేస్తున్నారు? అనేది తెలుసుకుని వస్తే ప్రశ్నలు అడిగేందుకు మీకు, సమాధానాలు చెప్పేందుకు మాకు బాగుంటుంది’’ అని మర్యాద పూర్వకంగానే చెప్పానని అన్నారు. అలా చెప్పడాన్ని అందరూ కౌంటర్ అనుకుంటున్నారని నందినిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Nandini Reddy
Tollywood
Tirupati
Anni Manchi Sakunamule

More Telugu News