life protection: ఏటా రూ.456 చెల్లిస్తే రూ.4 లక్షల బీమా

life protection with PM Jeevan Jyoti Bima Yojana Suraksha Bima Yojana

  • ప్రధానమంత్రి జీవన్ జ్యోతిలో రూ.2 లక్షల జీవిత బీమా
  • ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో రూ.2 లక్షల ప్రమాద బీమా
  • బ్యాంకు శాఖకు వెళ్లి దరఖాస్తు ఇస్తే చాలు
  • సేవింగ్స్ ఖాతా నుంచి ఏటా ప్రీమియం వసూలు

సంపాదించే ప్రతీ వ్యక్తికి ఉండాల్సిన కవరేజీ జీవిత బీమా. ప్రాణ ప్రమాదం జరిగితే అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకోవాలంటే బీమా ప్లాన్ తప్పకుండా తీసుకోవాలి. మెరుగైన బీమా రక్షణ కోసం ఏటా పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించలేని వారు.. తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే కేవలం రూ.456 ప్రీమియానికి రూ.4 లక్షల కవరేజీ వీటి కింద లభిస్తుంది.

జీవన్ జ్యోతి బీమా
18 నుంచి 50 ఏళ్ల వయసు వారు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. 50 ఏళ్లు ముగిసేలోపు ఈ ప్లాన్ లో చేరితే 55 ఏళ్ల వరకు కొనసాగించుకోవచ్చు. 56 ఏళ్లు వచ్చిన తర్వాత నుంచి ఇందులో కొనసాగడానికి లేదు. ఏడాదికి ప్రీమియం రూ.436. రూ.2 లక్షలకు జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. ఏ కారణంతో మరణించినా ఈ మేరకు పరిహారం చెల్లిస్తారు. బ్యాంక్ కు వెళ్లి దరఖాస్తు సమర్పిస్తే, వారి సేవింగ్స్ ఖాతా నుంచి ఏటా ప్రీమియంను డెబిట్ చేసుకుంటారు. జాయింట్ అకౌంట్ ఉంటే, ఎవరికి వారు రూ.436 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల కవరేజీ పొందొచ్చు. ఇందులో మెచ్యూరిటీ ప్రయోజనాలు ఏమీ ఉండవు. మరణించిన సందర్భంలోనే రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లిస్తారు. ఏటా జూన్ 1 నుంచి మరుసటి ఏడాది మే 31 వరకు కవరేజీ కొనసాగుతుంది. 

సురక్ష బీమా యోజన
ఇది ప్రమాద మరణ బీమా. 18-70 ఏళ్ల వయసు వరకు దీన్ని తీసుకోవచ్చు. ప్రమాదంలో మరణిస్తే రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా అవయవాలను కోల్పోతే తీవ్రతను ఆధారంగా రూ.1-2లక్షలు పరిహారంగా వస్తుంది. ఏటా జూన్ 1 నుంచి మే 31 వరకు ఏడాది కాలంగా పరిగణిస్తారు. బ్యాంకు శాఖకు వెళ్లి దరఖాస్తు ఇస్తే ఏటా ప్రీమియంను ఆటోమేటిక్ గా సేవింగ్స్  ఖాతా నుంచి మినహాయించుకుంటారు.

More Telugu News