Karnataka: కర్ణాటక ఫలితాల్లో 1957 నుంచి కొనసాగుతున్న 'రోన్' ఆనవాయతీ!
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది రోన్ లో గెలిచిన పార్టీయే
- ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టిన పార్టీలు
- ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ గెలుపు
కర్ణాటకలో రోన్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేతలు నమ్ముతుంటారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. 1957 నుంచి ఈ ఆనవాయతీ కొనసాగుతోంది. ఓ రకంగా 1957 నుంచి రోన్ నియోజకవర్గంలో అధికారపక్ష ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే ఆనవాయతీ కొనసాగింది. గడగ్ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ గెలుపొందారు.
ఈ సెంటిమెంట్ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే అన్ని పార్టీలు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. చేరికలను ప్రోత్సహించడంతో పాటు ప్రచారంలోనూ ప్రత్యేకత కొనసాగించాయి. రోన్ లో గెలిచితీరాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుదలగా ప్రచారం చేశాయి. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ ఆధిక్యంలోనే కొనసాగారు. రోన్ నియోజకవర్గంలో మొత్తం 2,21,059 మంది ఓటర్లు ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి సంగనగౌడ పాటిల్ 94,064 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కలకప్ప గురుశాంతప్ప బండి 69,519 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.