USA: కుల వివక్ష బిల్లుకు కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం

California Senate Passes Bill To Ban Caste Discrimination
  • రాష్ట్రంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రైవేట్ బిల్
  • త్వరలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పంపనున్న సభాపతి
  • ఈక్వాలిటీ ల్యాబ్ సంస్థతో కలిసి ఈ బిల్లుకు రూపకల్పన చేసిన సెనేటర్ ఐషా వాహబ్
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ చారిత్రాత్మక కుల వివక్ష నిరోధక బిల్లును పాస్ చేసింది. సెనేట్ లో 40 మంది సభ్యులు ఉండగా.. ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో 35 మంది పాల్గొన్నారు. అందులో బిల్లుకు అనుకూలంగా 34 మంది వ్యతిరేకంగా ఒకరు ఓటేశారు. దీంతో బిల్లు పాస్ అయినట్లు సభాపతి ప్రకటించారు. త్వరలో ఈ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పంపిస్తామని, అక్కడ పాస్ అయ్యాక గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని తెలిపారు. గవర్నర్ సంతకం చేశాక ఈ ఎస్ బీ 403 బిల్లు చట్టంగా మారుతుందని వివరించారు.

అమెరికా చరిత్రలోనే కుల వివక్షను నిరోధించేందుకు తయారుచేసిన బిల్లును పాస్ చేసిన తొలి సెనేట్ గా కాలిఫోర్నియా సెనేట్ నిలిచింది. రాష్ట్రంలో కుల వివక్ష కొనసాగుతోందని, దానిని రూపుమాపాలని కాలిఫోర్నియా సెనేటర్ ఐషా వాహబ్ ఎస్ బీ 403 బిల్లును సెనేట్ లో ప్రవేశపెట్టారు. కులం కారణంగా వివక్ష చూపడం, హింసకు పాల్పడడం చట్ట విరుద్ధంగా మార్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రంలో అన్నిచోట్లా అందరికీ సమాన అవకాశాలు, సదుపాయాలు, సేవలు అందాలని ఐషా వాహబ్ కోరుతున్నారు. ఇందుకోసం కుల వివక్షను నేరంగా ప్రకటించాలని ఈక్వాలిటీ ల్యాబ్ సంస్థతో కలిసి ఆమె పోరాడుతున్నారు. ఇందులో భాగంగా వివక్షను ఎదుర్కొంటున్న వారికి రక్షణ కల్పించేందుకు అవసరమైన విధివిధానాలతో ఎస్ బీ 403 బిల్లును సెనేట్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సెనేట్ ఆమోదం పొందడంపై వాహబ్ సంతోషం వ్యక్తం చేశారు.
USA
California
caste discrimination
ban

More Telugu News