Naveen Patnaik: కాంగ్రెస్-బీజేపీకి సమాన దూరం పాటిస్తాం.. థర్డ్ ఫ్రంట్‌లో చేరడం లేదు: నవీన్ పట్నాయక్
- మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన నవీన్
- ప్రధానితో 20 నిమిషాల పాటు భేటీ
- తమ విధానంలో మార్పు ఉండబోదన్న సీఎం
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీని గద్దెదింపేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటివారు తాము కాంగ్రెస్-బీజేపీలకు సమాన దూరం పాటిస్తామని, థర్డ్ ఫ్రంట్‌లో చేరే ఆలోచన లేదని చెబుతూ వస్తున్నారు. తాజాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఇదే చెప్పారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, కాబట్టి తృతీయ కూటమి (థర్డ్ ఫ్రంట్)లో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన నిన్న సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. వారి మధ్య 20 నిమిషాలపాటు చర్చలు జరిగాయి. అనంతరం నవీన్ పట్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బిజూ జనతా దళ్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. కాంగ్రెస్-బీజేపీకి సమాన దూరం పాటించాలన్న తమ విధానానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కూటమి గురించి తాను చర్చించలేదని పేర్కొన్నారు.