Sajjala Ramakrishna Reddy: పవన్ వ్యాఖ్యలు చూస్తే జీవితాంతం అతను ఎలాంటి పాత్ర పోషించనున్నాడో అర్థమవుతోంది: సజ్జల

Sajjala reacts to Pawan Kalyan comments

  • తాను సీఎం అభ్యర్థి రేసులో లేనన్న పవన్
  • పవన్ మనసులో ఏముందో తెలిసిందన్న సజ్జల
  • చంద్రబాబును, లోకేశ్ ను వరుసగా సీఎం చేయడమే పవన్ లక్ష్యమని వెల్లడి
  • ఫ్యాన్స్ కలలను పవన్ చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని విమర్శలు

వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తమ అజెండా అని, కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని, తాను సీఎం అభ్యర్థిని కానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో చెప్పడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 

పవన్ మనసులో ఏముందో బట్టబయలైందని, చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ అజెండా అని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక నీటి బుడగ వంటిదని, తనకు సొంత బలం లేదని పవన్ అంగీకరించారని సజ్జల పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని ఆయన అభిమానులు కలలు కన్నారని, కానీ అభిమానుల కలలను పవన్ చంద్రబాబుకు తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. 

"ఇవాళ పవన్ వ్యాఖ్యలు చూస్తే జీవితాంతం అతను ఎలాంటి పాత్ర పోషించనున్నాడో అర్థమవుతోంది. మొదట చంద్రబాబును, ఆ తర్వాత లోకేశ్ ను వరుసగా ఎలా అధికారంలోకి తీసుకురావాలన్నదే పవన్ అజెండా. పవన్ సీఎం అయితే చూడాలని అభిమానులు కోరుకున్నారు. కానీ వారిని పవన్ వాడుకుని, ఆ శక్తిని మొత్తం చంద్రబాబుకు తాకట్టు పెట్టేశాడు.

బలం లేదని చెబుతున్న పవన్ రాజకీయాలకేమీ కొత్త కాదు. 2010 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 12 ఏళ్లకు పైగా అనుభవం ఉండి కూడా సొంతంగా ఎందుకు ఎదగలేకపోయాడు? జగన్ 2011లో వైఎస్సార్ మరణం తర్వాత పార్టీ పెట్టి ఏ స్థాయికి ఎదిగాడో చూశాం. పవన్ కు కూడా రాజకీయాల్లో అంత సీనియారిటీ ఉంది. పైగా సినిమా హీరో కూడా. 

వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని పవన్, చంద్రబాబు అంటున్నారు... ఆ మాట ప్రజలు అనడంలేదు.  పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు కలలే పవన్ కల్యాణ్ కలలు... చంద్రబాబు ఊహలే పవన్ ఊహలు అన్నట్టుగా ఉంది. దుష్ట శక్తులన్నీ ఏకం అవుతున్నాయని జగన్ ముందే చెప్పారు. ఇప్పుడదే జరుగుతోంది" అని సజ్జల వివరించారు.

  • Loading...

More Telugu News