YS Jagan: రేపటి నుంచి 6 రోజుల పాటు మహాయజ్ఞం.. హాజరుకానున్న సీఎం జగన్
- రేపటి నుండి చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం
- మొదటి, చివరి రోజు యజ్ఞంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
- 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో యజ్ఞం
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాయజ్ఞానికి శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం నుండి ఆరు రోజుల పాటు చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం చేస్తున్నారు. మహా యజ్ఞానికి సంకల్పం చెప్పేందుకు జగన్ రేపు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియానికి వస్తున్నారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. మహా యజ్ఞానికి సంబంధించి బందోబస్తు కార్యక్రమాలను డీసీపీ విశాల్ గున్ని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు చెందిన సూపరింటెండెంట్ స్థాయి అధికారులు మొదలు కమిషనర్ వరకు ఈ యజ్ఞానికి హాజరవుతున్నారు.
రేపటి నుండి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యజ్ఞం జరగనుంది. సాయంత్రం ఆరు గంటల నుండి స్తోత్రపారాయణాలు, ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయాలకు చెందిన దేవతామూర్తుల కల్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆఖరి రోజు ఈ నెల 17న పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుంది. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు.