CSK: చెన్నై జట్టుకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ లభించాడు: శ్రీశాంత్
- డ్వేన్ బ్రావోకి సరైన ప్రత్యామ్నాయం పతిరణ అన్న శ్రీశాంత్
- కుర్ర బౌలర్ నుంచి మంచి ఫలితాలు రాబట్టడంపై అభినందనలు
- అతడి బంతులను బ్యాటర్లు అర్థం చేసుకోవడం కష్టమనే అభిప్రాయం
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లభించిన ఆణిముత్యం మతీష పతిరణ అని టీమిండియా మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. మతీష పతిరణ రూపంలో ఓ మంచి డెత్ ఓవర్ల బౌలర్ ను చెన్నై జట్టు వెలుగులోకి తీసుకొచ్చిందని ప్రశంసించాడు. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న చెన్నై జట్టు తరఫున ఈ సీజన్ లో పతిరణ మెరుగైన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం.
చివరి ఓవర్లలో కీలక సందర్భాల్లో డ్వేన్ బ్రావో మాదిరి వికెట్లు తీసే ఓ నమ్మకమైన బౌలర్ పతిరణ రూపంలో చెన్నై జట్టుకు లభించాడని శ్రీశాంత్ పేర్కొన్నాడు. బుధవారం డిల్లీతో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో పతిరణ ఒక వికెట్ తీయడంతో పాటు చాలా తక్కువ పరుగులు ఇవ్వడం తెలిసిందే. నిన్నటి మ్యాచ్ లో పతిరణ మొత్తం మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా చివర్లో ఢిల్లీ తరఫున చెలరేగి ఆడుతోన్న అక్సర్ పటేల్ వికెట్ తీసి చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు పతిరణ. శ్రీలంక ప్రముఖ మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్ శైలిని పోలిన పతిరణ పేస్ ను చాలా మంది క్రికెట్ పండితులు మెచ్చుకుంటుండడం గమనార్హం. అతడికి వైట్ బాల్ లో మంచి భవిష్యత్తు ఉందని స్వయంగా ధోనీ సైతం ప్రకటించాడు.
పతిరణ ఈ సీజన్ లో స్థిరమైన ప్రతిభ చూపిస్తున్నాడని, మెరుగైన ప్రదర్శన ఇవ్వని సమయంలోనూ అతడికి సీఎస్కే నుంచి మద్దతు లభించినట్టు శ్రీశాంత్ పేర్కొన్నాడు. అతడు బ్యాటింగ్ కూడా చేయగలిగితే బ్రావోకు సరైన ప్రత్యామ్నాయం అవుతాడన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘యార్కర్లే కాదు, అందమైన స్లో బాల్స్ కూడా వేయగలడు. బ్యాటర్ వాటిని అర్థం చేసుకోవడం కష్టం’’ అని పేర్కొన్నాడు. పతిరణ వంటి బౌలర్ ను తీర్చిదిద్దే విషయంలో ధోనీ పెద్దన్న పాత్ర పోషించడాన్ని శ్రీశాంత్ మెచ్చుకున్నాడు. అందుకే ధోనీ వంటి కెప్టెన్ కావాలన్నాడు.