life insurance: ఒకరికి ఎంత బీమా రక్షణ అవసరం?
- ఆర్జించే వ్యక్తికి ప్రాణాపాయం వాటిల్లితే కుటుంబం రోడ్డున పడకూడదు
- కనీసం 10-15 ఏళ్ల కుటుంబ అవసరాలకు సరిపడా బీమా కవరేజీ
- రుణాలు, భవిష్యత్ లక్ష్యాలకు కావాల్సిన మొత్తాన్ని కూడా కలుపుకోవాలి
నేడు కుటుంబాలు చిన్నవైపోయాయి. ఆర్థిక, అంగ బలం ఉన్న కుటుంబాలు కూడా తక్కువే. మరి అలాంటిది ఓ చిన్న కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అనుకోని కారణాలతో, ప్రమాదం కారణంగా మరణిస్తే.. ఆ చిన్న కుటుంబం పరిస్థితి ఏంటి..? ఎవరు పోషించాలి? అందుకని సంపాదించే ప్రతీ వ్యక్తి తన కుటుంబ రక్షణ కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే రోజుల్లో ఒకరికి ఏదైనా జరిగితే కుటుంబంలోనే మరొకరు బాధ్యతలు చూసేవారు. కానీ నేడు భార్యా భర్త, పిల్లలతో న్యూక్లియర్ కుటుంబాలుగా మారిపోయిన రోజుల్లో జీవిత బీమా రక్షణకు ప్రాధాన్యం పెరిగింది. జీవిత బీమాలోనూ చివర్లో రాబడినిచ్చే పాలసీలు మెరుగైనవి కావు. దురదృష్టవశాత్తూ మరణించినప్పుడు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించే టర్మ్ ప్లాన్లే మెరుగైనవి. జీవిత బీమా ఉద్దేశ్యం అనుకోనిది జరిగితే ఆదుకోవడమే. కనుక జీవిత బీమా ఎప్పుడూ కూడా టర్మ్ ప్లాన్ రూపంలోనే ఉండాలని నిపుణులు చెబుతుంటారు. కాకపోతే ఒకరికి ఎంత కవరేజీతో టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నది పెద్ద చిక్కుముడి ప్రశ్న. చాలా మంది తేల్చుకోలేరు. ఇందుకు కొన్ని అంశాలను చూడాలి.
ప్రస్తుతం మీ నెలవారీ జీవన అవసరాలకు ఎంత ఖర్చవుతోంది. ఏడాదికి ఎంత కావాలన్నది లెక్క వేసుకోవాలి. భవిష్యత్తులో వివిధ లక్ష్యాలకు ఎంత కావాలో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు పిల్లల విద్యకు ఎంత ఖర్చు అవుతుంది, వారి వివాహాలకు ఎంత ఖర్చు అవుతుంది. సొంతిల్లుకు ఎంత కావాలి. ఇవన్నీ జీవితంలో సాధించాల్సినవే. తాము లేకపోయినా తమ ఆకాంక్షలు జీవించే ఉండాలంటే బీమా కవరేజీలో వాటికీ చోటివ్వాలి. అలాగే, ఇంటి కొనుగోలుకు, ఇతర అవసరాలకు రుణాలు తీసుకుంటే ఆ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. కనీసం 70 ఏళ్ల కుటుంబ అవసరాలకు కావాల్సిన మొత్తాన్ని అంచనా వేసుకోవాలి.
ప్రస్తుత వార్షిక అవసరాలకు ఎంత ఖర్చవుతుందో చూసుకుని, కనీసం 10-15-20 ఏళ్ల అవసరాలకు సరిపడా కవరేజీతో టర్మ్ ప్లాన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. వృద్ధాప్యంలో ఆరోగ్యం, వైద్యం కోసం భారీగా ఖర్చవుతుంది. కనుక భవిష్యత్తులో ఎదురయ్యే ఈ ఖర్చులను తీర్చే విధంగా బీమా కవరేజీ ఉండాలి. చేస్తున్న పనికి తగ్గట్టు ప్రాణాలకు రిస్క్ ఉంటుంది. రవాణా రంగంలో ఉన్న వారికి, పరిశ్రమలో పనిచేసే వారికి రిస్క్ ఎక్కువ. బయట మార్కెటింగ్ చేసే వారికి కూడా రిస్క్ ఎక్కువే. కనుక రిస్క్ ఎక్కువగా ఉన్న వారు కొంచెం మెరుగైన కవరేజీతో తీసుకోవాలి. ఇక బీమా తీసుకున్న తర్వాత ప్రతి ఐదేళ్లకోసారి కవరేజీని సమీక్షించుకుంటూ వెళ్లాలి.