adireddy apparao: ఆదిరెడ్డి అప్పారావు, వాసులకు హైకోర్టులో బెయిల్ మంజూరు

jagajjanni chit fund Director adireddy apparao gets bail
  • జగజ్జనని చిట్ ఫండ్ కేసులో మంజూరు చేసిన హైకోర్టు
  • పిటిషనర్లను జైలులో ఉంచాల్సిన అవసరంలేదన్న అప్పారావు లాయర్లు
  • కేసు విచారణ జరుగుతున్న క్రమంలో బెయిల్ ఇవ్వొద్దంటూ ఏజీ వాదన
  • డిపాజిటర్ల చట్టం ఏ విధంగా వర్తిస్తుందని ప్రశ్నించిన న్యాయమూర్తి
జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం అప్పారావు, వాసులు పెట్టుకున్న పిటిషన్ పై రెండు రోజుల క్రితమే వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. తాజాగా బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అప్పారావు, వాసులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, చిట్ ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదంటూ అప్పారావు తరపు లాయర్లు కోర్టులో వాదించారు. డిపాజిట్ దారులు ఎవరూ ఫిర్యాదు చేయకుండానే కేసు నమోదు చేశారని, తమ క్లయింట్లను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. కాగా, చందాదారుల సొమ్మును చట్టవిరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు.

జగజ్జనని చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఏపీ సీఐడీ డిపాజిటర్ల చట్టం కింద కేసు నమోదు చేసింది. చందాదారుల సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించారని యాజమాన్యంపై ఆరోపించింది. ఈ కేసులో జగజ్జనని చిట్ ఫండ్స్ డైరెక్టర్లు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం అప్పారావు, శ్రీనివాస్ లు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణకు అవసరమైన రికార్డులన్నీ చిట్ రిజిస్ట్రార్ల వద్ద ఉన్నాయని, తమ క్లయింట్లు విచారణకు సహకరిస్తారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.

దర్యాఫ్తు పేరుతో తమ క్లయింట్లను జైలులో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. అయితే, కేసు దర్యాఫ్తు కొనసాగుతున్న క్రమంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. సొమ్ము చెల్లింపుపై చందాదారులకు అభ్యంతరం లేనపుడు ఈ కేసులో డిపాజిటర్ల చట్టం ఏ విధంగా వర్తిస్తుందని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. అయితే, చందాదారుల సంక్షేమం దృష్ట్యా రెగ్యులేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టుకు ఏజీ వివరించారు.
adireddy apparao
adireddy vasu
jagajjanani chits
AP High Court
bail

More Telugu News