Adani Hindenburg: అదానీ గ్రూప్ - హిండెన్ బర్గ్ ఆరోపణలపై సుప్రీంకోర్టుకు నిపుణుల కమిటీ నివేదిక
- మార్చి 2న నిపుణుల కమిటీ నియామకం
- నివేదిక ఇవ్వాలని సెబీకి సైతం ఆదేశం
- రెండు నెలల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు
- ఈ నెల 8న నివేదిక సమర్పించిన కమిటీ
- తమకు మరో ఆరు నెలల గడువు కావాలన్న సెబీ
అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ చేసిన సంచలన ఆరోపణలపై సుప్రీంకోర్టుకు నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించింది. అదానీ గ్రూప్ మారిషస్ కేంద్రంగా కంపెనీలను ఏర్పాటు చేసి, వాటికి నిధులు మళ్లింపు చేసిందని, మారిషస్ నుంచి తన షేర్లను కొనిపిస్తూ కృత్రిమంగా వాటి ధరలు పెంచుకుంటూ పోయిందని, ఖాతాల్లో అవకతవకలకు పాల్పడిందని, రిలేటెడ్ పార్టీ లావాదేవీలను దాచి పెట్టిందంటూ హిండెన్ బర్గ్ ఎన్నో సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు తన ఆరోపణలకు మద్దతుగా ఓ నివేదికను విడుదల చేసింది. దీంతో అదానీ గ్రూపు షేర్లు ఏడాది గరిష్ఠాల నుంచి 70 శాతం వరకు పడిపోయి, తర్వాత కొంత కోలుకున్నాయి.
హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు, అదానీ షేర్ల పతనం నేపథ్యంలో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో హిండెన్ బర్గ్ ఆరోపణలపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. ఇందుకు రెండు నెలల గడువు ఇచ్చింది. అలాగే సమాంతరంగా నిపుణులతో మరో కమిటీని నియమిస్తూ మార్చి 2న ఆదేశాలు జారీ చేసింది.. ఈ ఆరోపణల్లోని నిజా నిజాలపై నివేదిక సమర్పించాలని కోరింది. సెక్యూరిటీస్ చట్టం ఉల్లంఘనలు జరిగాయా, అదానీ గ్రూప్ విషయంలో నియంత్రణ సంస్థ వైఫల్యం ఉందా? ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ఆదేశించింది. దీంతో నిపుణుల కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్ లో ఈ నెల 8న సుప్రీంకోర్టుకు సమర్పించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ నెల 12న ఇది విచారణకు రానుంది.
మరోవైపు అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల్లో వాస్తవాలను తేల్చేందుకు తమకు మరో ఆరు నెలల సమయం ఇవ్వాలంటూ సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారించాల్సి ఉంది.