LinkedIn: ఉద్యోగాల కోసం వెతికే వెబ్ సైట్ లోనే ఉద్యోగుల తొలగింపు!
- 716 మంది ఉద్యోగులను తీసేయనున్న లింక్డ్ఇన్
- గత ఫిబ్రవరిలో కూడా కొందరిని తీసేసిన సంస్థ
- చైనాలో నడుస్తున్న జాబ్ సెర్చ్ యాప్ ‘ఇన్ కెరియర్స్’ కూడా దశలవారీగా మూత
లింక్డ్ ఇన్.. ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ఉద్యోగాలిచ్చే వాళ్లకు.. మంచి ప్లాట్ ఫామ్. మన నైపుణ్యాలకు/అవసరాలకు సెట్ అయ్యే ఉద్యోగాలను క్షణాల్లో చూపిస్తుంది. అందుకే ఈ సైట్ బాగా పాప్యులర్. కానీ మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్ ఇన్ ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. అందులో భాగంగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
716 మంది ఉద్యోగులను తీసేసేందుకు లింక్డ్ఇన్ యాజమాన్యం సిద్ధమైంది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 3.5 శాతం. నిజానికి ఫిబ్రవరిలోనూ కొందరు ఉద్యోగులను తొలగించింది. మరోవైపు చైనాలో నడుస్తున్న జాబ్ సెర్చ్ యాప్ ‘ఇన్ కెరియర్స్’ను కూడా దశలవారీగా ఆగస్టు 9 కల్లా మూసేయనున్నట్లు ప్రకటించింది.
లింక్డ్ ఇన్ లో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతేడాదిలో ప్రతి త్రైమాసికంలో ఆదాయం పెరిగినప్పటికీ ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించడం గమనార్హం. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా అమ్మకాలు, కార్యకలాపాలు, సహాయక బృందాల్లో స్టాఫ్ ను తగ్గించాలని భావిస్తున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో లింక్డ్ ఇన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
మరోవైపు ప్రధాన టెక్ కంపెనీలు ఈ ఏడాది భారీగా లేఆఫ్ లు ప్రకటించాయి. గత ఆరు నెలల వ్యవధిలో దాదాపు 2.7 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ‘లేఆఫ్స్.ఫియి’ అనే సంస్థ వెల్లడించింది. ఫేస్ బుక్ ఓనర్ ‘మెటా’లో 21 వేల మందిని, గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్’లో 12 వేల మందిని తొలగించారు. గత జనవరిలో మైక్రోసాఫ్ట్ లోనూ 10 మందిని ఇంటికి పంపేశారు.