Jagan: ఎక్కడా పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకే ఈ కార్యక్రమం: సీఎం జగన్

ys jagan launches jaganannaku chebudam programme for quality grievance redressal

  • స్పందన కంటే మెరుగ్గా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్న జగన్
  • ప్రభుత్వం న్యాయంగా ఉంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్య
  • ప్రజలు చేసే ఫిర్యాదులు నేరుగా తన కార్యాలయానికే వస్తాయని వెల్లడి

ఏపీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం ఇవాళ మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న ‘స్పందన’తోపాటు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్ ఈ మేరకు ప్రారంభించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు మరింత మెరుగ్గా పరిష్కారం చూపించేందుకు వీలుగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. తన పాదయాత్రలో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కనిపించిన సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పాలన సాగించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో 90 నుంచి 95 శాతం సమస్యలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని జగన్ అన్నారు. ప్రభుత్వం న్యాయంగా ఉంటే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుందని భావించినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా పథకాలకు పొందాలంటే జన్మభూమి కమిటీలు ‘ఏ పార్టీ’ అని అడిగి వాటిని ఇచ్చేవని ఆరోపించారు. పెన్షన్ల నుంచి ఇళ్ల కేటాయింపుల వరకూ ఇదే పరిస్థితి ఉండేదన్నారు.

‘‘పెన్షన్ల దగ్గర నుంచి ఇళ్ల కేటాయింపుల దాకా.. ఏ పథకం తీసుకున్నా వివక్ష, లంచాలు కనిపించేవి. ‘మేం ఇవ్వగలిగింది ఇంతే.. ఊర్లో ఇంత మందికే ఇస్తాం. మిగిలిన వాళ్లకు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న వాళ్లలో ఎవరైనా చనిపోతేనో, తప్పుకుంటేనో తప్ప ఇవ్వలేం’ అని చెప్పేవాళ్లు. అర్హులందరికీ పథకాలు అందజేయాలన్న ఉద్దేశం వారికి ఎన్నడూ లేదు. అర్హులందరికీ పథకం అందించే పరిస్థితి రావాలి. లంచాలు లేకుండా ఇవ్వగలగాలి’’ అని అన్నారు.  

ప్రజలకు మరింత చేరువయ్యేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు జగన్ తెలిపారు. ‘‘వివక్షకు తావులేని వ్యవస్థ తీసుకురావాలనే ఉద్దేశంతో విప్లవాత్మక అడుగులు వేశాం. అందులో భాగంగానే స్పందన కార్యక్రమం అమలు చేశాం. స్పందన కంటే మెరుగ్గా ఉండేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం’’ అని వివరించారు.

అర్హత ఉన్నా పథకాలు అందని వాళ్లు, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైన వాళ్లకు మెరుగైన పరిష్కారం చూపేందుకే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ల నుంచి కమిషనర్ల వరకు, సచివాలయాల దాకా అందరినీ భాగస్వాముల్ని చేస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్నట్లు జగన్ తెలిపారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఇదో మంచి వేదిక అవుతుందన్నారు. ఎక్కడా పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు నేరుగా 1902కు ఫోన్ చేయాలని సూచించారు. మీరు చేసే ఫిర్యాదులు నేరుగా తన కార్యాలయానికే వస్తాయన్నారు.

  • Loading...

More Telugu News